ఉత్తర తెలంగాణకు వరం శ్రీరాంసాగర్ పునర్జీవ పథకం
రెండువేల కోట్లతో రీడిజైనింగ్
వచ్చే ఏడాదికల్లా పూర్తికానున్న పనులు
సిఎం కెసిఆర్ ప్రత్యక్ష పర్యవేక్షణతో పనుల్లో వేగం
నిజామాబాద్,ఆగస్ట్8(జనంసాక్షి): ఉత్తర తెలంగాణకు వరప్రదాయినిగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రూపుదిద్దు కోబోతంది. దీనిని నిరంతరంగా నిండుకుండలా చేసేందుకు భార పథకానికి సిఎం కెసిఆర్ శ్రీకారం చుట్టారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పూర్వ వైభవం కల్పించేందుకు ఉద్దేశించిన పునర్జీవ పథకాన్ని త్వరగా పూర్తి చేసేలా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పట్టుదలతో ఉన్నారు. గోదావరి నది నుంచి వేర్వేరు ప్రాంతాల్లో లిఫ్టులు ఏర్పాటు చేసి.. నీటిని ఎస్సారెస్పీలోకి ఎత్తిపోసేలా పథకాన్ని రూపొందించారు. దీంతో ఆయకట్టులోని 16 లక్షల ఎకరాలకు రెండు పంటలకూ నీళ్లిచ్చేందుకు వీలుగా తయారు చేయబోతున్నారు. ఎస్సారెస్పీ పునర్జీవ పథకంద్వారా 9.63 లక్షల ఎకరాలకు ప్రతిఏటా రెండు పంటలకూ నీరందించాలనేది లక్ష్యం. గోదావరిలో 56 టీఎంసీల నీటి లభ్యత ఉండగా.. ఎస్సారెస్పీపై ఎల్‌ఎండీ వరకు 95 టీఎంసీల నీటి డిమాండు ఉంది. అందుకే ఈ పథకంద్వారా ప్రతి ఏటా 95 టీఎంసీల నీటి లభ్యత ఉండేలా పునర్జీవ పథకం దోహదపడుతుంది. ఒకవేళ 54 టీఎంసీల నీటి లభ్యత లేకున్నా.. ఈ పథకంద్వారా ఎస్సారెస్పీలోకి పూర్తిస్థాయి నీటిని తరలిస్తారు. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సరికొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టనుంది. శ్రీరాంసాగర్ కాల్వల ఆధునీకరణ పనులకుగాను మరో రూ.750 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా ఇంతకాలం శ్రీరాంసాగర్ నీరు చూడని జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్ ప్రాంతాలకు సాగునీరు అందనుంది. ఎస్సారెస్పీ కాల్వలు ప్రవహించే మార్గంలో చెరువులన్నీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నింపేందుకు నీటిపారుదల శాఖ ప్రణాళికలు కూడా సిద్ధంచేస్తున్నది. అనేక చెరువులను రిజర్వాయర్లుగా మార్చే ప్రతిపాదనలు కూడా తయారవుతున్నాయి. పేరుకే ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా ఉన్న ఈ చారిత్రాత్మక ప్రాజెక్టును ఆచరణలోకి తీసుకుని వచ్చేలా రాష్ట్ర సర్కారు నడుం బిగించింది. వచ్చే వానాకాలం పంట సీజన్‌నాటికి ఈ పథకాన్ని సిద్ధంచేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు దాదాపు 250 కిలోవిూటర్ల దిగువన గోదావరిపై కాళేశ్వరం మేడిగడ్డ వద్ద లభించే నీటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది. మేడిగడ్డ నుంచి ఏకంగా శ్రీరాంసాగర్ జలాశయంలోకి పైపుల ద్వారా గోదావరి జలాలను తరలించే బృహత్తర పథకం కానపుంది. కాళేశ్వరం నుంచి 140 కిలోవిూటర్ల మేర గోదావరిలో అక్కడక్కడా కాల్వలు నిర్మించి ఎత్తిపోస్తారు. ఇందుకోసం మొత్తం ఏడు ఎత్తిపోతలు నిర్మించనున్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ఎత్తిపోతలకు సంబంధించి పంపుహౌస్ పనులు కొనసాగుతున్నాయి. ఎల్లంపల్లి, నందిమేడారం వద్ద ఇప్పటికే పంపుహౌస్ పనులు పూర్తిచేశారు. శ్రీరాంసాగర్ వరద కాల్వపై మూడు ఎత్తిపోతలు, పంపుహౌస్ పనులు ఈ ఏడాదిలో చేపట్టనున్నారు. డిజైన్‌లో పేర్కొన్నట్టు 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే ప్రాజెక్టు లక్ష్యం మాత్రం ఇప్పటికీ నెరవేరలేదు. ఎస్సారెస్పీ మొదటిదశకింద 9.68 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి. ఇందుకు గాను ప్రధానంగా 8500 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నిర్మించిన కాకతీయ కాల్వలో ఏనాడూ మూడునాలుగు వేల క్యూసెక్కులకుమించి ప్రవాహంలేదు. దీంతో చివరి భూములకు సాగునీరు అందడం లేదు. ప్రాజెక్టు, కాల్వల నిర్వహణ అధ్వానంగా ఉండటంతో గత దశాబ్దంన్నరలో ఇన్‌ఫ్లో పుష్కలంగా ఉన్న రోజుల్లో కూడా నాలుగున్నర లక్షల ఎకరాలకు మించి ఆయకట్టుకు సాగునీరు అందించిన దాఖలాలు లేవు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టుపై దృష్టిసారించారు. ఫలితంగా ఎల్‌ఎండీ ఎగువన కాల్వ ప్రవాహసామర్థ్యం 7వేల క్యూసెక్కుల వరకు, దిగువన 5వేల క్యూసెక్కుల వరకు పెరిగింది. గత మూడేండ్లుగా శ్రీరాంసాగర్‌ను పునర్నిర్మాణం దిశగా నడిపిన ప్రభుత్వం ఇక దాని పునర్జీవానికి రంగం సిద్ధంచేసింది. ఇందుకు రీడిజైనింగ్‌తో అతితక్కువ ఖర్చుతో రైతులకు భారీ ప్రయోజనాన్ని అందించేందుకు పథకాన్ని రూపొందించింది. ప్రధాన గోదావరిలో ఎగువ మహారాష్ట్రనుంచి చుక్క వరద నీరు రాకున్నా శ్రీరాంసాగర్‌లో నిత్యం జలకళ ఉట్టిపడేలా ఈ బృహత్తర డిజైన్‌ను తయారుచేశారు. కాళేశ్వరం వద్ద ప్రాణహిత నదిలో ఏప్రిల్, మే, జూన్ నెలలు మినహా మిగితా సమయంలో సమృద్ధిగా నీరు ఉంటుంది. గోదావరి నదిలో సరిపడా నీటి ప్రవాహం లేకపోయినా.. ప్రాణహితలో మాత్రం ఏడాది పొడుగునా సుమారు 3 లక్షల క్యూసెక్కుల నీరు అందుబాటులో ఉంటుంది. ఏటా పెద్ద మొత్తంలో నీరు బంగాళాఖాతంలోకి పోతున్నది. ఈ వృథా నీటిని ఇప్పుడు అందింపుచ్చు కోనుంది. శ్రీరాంసాగర్ జలాశయంలో గోదావరి వరద ఎక్కువైనపుడు వరద కాల్వద్వారా దిగువకు వదులాలి. కానీ గోదావరిలో నీటి లభ్యత లేనందున గోదావరికి ఉప నది, నీటి లభ్యత బాగా ఉన్న ప్రాణహిత నీటి లభ్యతను వరద కాల్వ ద్వారా శ్రీరాంసాగర్‌లోకి పోస్తారు. ఎస్సారెస్పీ కాకతీయకాల్వ కింద ఎల్‌ఎండీవరకు ఉండే ఆయకట్టుకు మాత్రమే ఎస్సారెస్పీ ద్వారా నేరుగా సాగునీరు అందిస్తారు. ఆ తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మిడ్ మానేరుకు నీటిని తరలిస్తున్నందున.. మిడ్ మానేరు నుంచి ఎల్‌ఎండీకి నీళ్లిచ్చి, ఆపై ఎల్‌ఎండీ దిగువ నుంచి కాకతీయ కాల్వద్వారా ఎస్సారెస్పీ-1, 2 దశల కింద ఉండే ఆయకట్టుకు సాగునీరు అందిస్తారు. దీంతో ఎస్సారెస్పీ రెండు దశలకింద చివరి ఆయకట్టువరకు రెండు పంటలకూ సమృద్ధిగా సాగునీరు అందనుంది. ఇందుకుగాను ప్రభుత్వం ఎస్సారెస్పీ కాల్వలన్నింటినీ పటిష్ఠం చేస్తున్నది. అందుకే సిఎం ఈ ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.