ఉద్యమపాఠాలు నేర్పింది జయశంకర్‌ సారే

కెసిఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ సాధించుకున్నాం
సిద్దిపేటలో హరీష్‌ రావు
సిద్దిపేట,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి):  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఉద్యమ పాఠాలు నేర్పింది కీర్తిశేషులు ప్రోఫెసర్‌ జయశంకరేనని మాజీ మంత్రి, ఎంఎల్‌ఏ తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో రూ. 70 లక్షల వ్యయంతో నిర్మించిన జయశంకర్‌ కమ్యూనిటీ భవనంను ఆయన గురువారం ప్రారంభించారు. తొలి, మలిదశ ఉద్యమాల్లో జయశంకర్‌ వెన్నంటు ఉన్నారని గుర్తుచేశారు. సిఎం కెసిఆర్‌, జయశంకర్‌లు ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారన్నారు. సిద్దిపేట పట్టణంలో నిర్మించిన విశ్వకర్మ భవానానికి మహానీయులు జయశంకర్‌ పేరు పెట్టడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. త్వరలోనే రూ. 50 లక్షలతో గజ్వేల్‌ లో సైతం భవనాన్ని నిర్మించడం జరుగుతుందన్నారు. జయశంకర్‌ అందించిన స్ఫూర్తి చరిత్ర పుటల్లో నిలిచిపోతుందన్నారు. అలాగే గతంలో సిద్దిపేటలో జయశంకర్‌ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు.
మాజీ స్పీకర్‌ మధుసూదనచారి సైతం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంబిసిలకు సబ్సిడీపై రుణాలు అందిస్తుందన్నారు. వృత్తిపరమైన నైపుణ్యం కోసం సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణను సైతం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అర్హులైన విశ్వకర్మ నిరుపేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల కేటాయింపులో చోటు కల్పిస్తామన్నారు. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్‌ను నివారించి పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి, వాటి సంరక్షణకు పాటుపడాలన్నారు. అంతకుముందు అక్కడే ఉన్న విశ్వకర్మ దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ ఛైర్మన్‌ కడవేర్గు రాజనర్సు, మునిసిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ ప్రతాప్‌, కౌన్సిలర్లు బూర శ్రీనివాస్‌, తెల్జరి శ్రీనివాస్‌ యాదవ్‌, బాసంగారి వెంకట్‌,యాదగిరి, శ్రీనివాస్‌, రవీంద్రచారి తదితరులు ఉన్నారు.