ఉద్యాన పంటలకు భారీగా నష్టం
ఇంకా నీటిలోనే మునిగిన పంటలు
భారీగా నష్టపోయిన కౌలురైతులు
విజయవాడ,సెప్టెంబర్5 (జనం సాక్షి) : అధిక వర్షాలు, వరదలతో కృష్ణా జిల్లాలో వ్యవసాయ, ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాల్లో ఇప్పటికీ పంటలు నీటిలో మునిగే ఉన్నాయి. పంట ముంపుపై ప్రాథమిక నివేదికలు రూపొందించిన ఆయా శాఖలు తాజాగా నష్టం అంచనాలను రూపొందించేందుకు కసరత్తు మొదలెట్టాయి. ఈ కెవైసి ప్రామాణికంగా సాగే ఈ గణనలో అత్యధిక విస్తీర్ణంలో పంటలు సాగు చేసి నష్టపోయిన కౌలు రైతులకు ఊరట ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. భూమి ఉన్న రైతులకన్నా..కౌలురైతులే అధికంగ ఆనస్టపోయారు. కౌలు చెల్లించి పంటలు చేపట్టిన వీరు నిండా మునిగారు. ఖరీప్ సీజన్‌లో వరి 85,032 ఎకరాలు, వేరుశనగ, పత్తి, చెరకు, మినుము 2745 ఎకరాల్లో, పసుపు, కంద, మునగ, బొప్పాయి, అరటి, తమలపాకు తదితర
ఉద్యాన పంటలు 9250 ఎకరాల్లో ముంపుకు గురయినట్లు ప్రాథమిక అంచనా. జిల్లాలోని 75 శాతం విస్తీర్ణంలోని పంటలను రెండు లక్షల మంది కౌలు రైతులు సాగు చేస్తున్నారు. ఈ సీజన్‌లో 70 వేల మందికి పంట సాగు ధ్రువీకరణ పత్రాలు (సిసిఆర్‌సి) ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నా ఇప్పటికి 56 వేల మందికి మాత్రమే అందాయి. పంట నష్టపరిహారం అందించే క్రమంలో ఇ`క్రాప్, ఇ`కెవైసిలను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇటీవల ఈ క్రాప్ పూర్తయింది. భూ యజమానుల పేరుతోనే పంట భూములకు ఇ`కెవైసి చేశారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో వాస్తవ సాగుదారులను గుర్తించి ఇ`కెవైసి చేస్తేనే కౌలు రైతులకు ఊరట కలుగుతుందని కౌలు రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా ఉద్యానపంటలు సాగు చేశారు. మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల, పమిడిముక్కల, తోట్లవల్లూరు, కంకిపాడు తదితర మండలాల్లోని నదీ పరివాహక ప్రాంత భూములకు భూ యజమానులు ముందుగానే కౌలు వసూలు చేశారు. అనేక మంది కౌలు రైతులు ఎకరాకు రూ. 40 వేలు ముందుగానే చెల్లించారు. పసుపు, కంద, అరటి, బొప్పాయి, మునగ, వివిధ రకాల కూరగాయల పంటలు సాగు చేశారు. కంద సాగుకు ఎకరాకు రూ. రెండు లక్షలు, మునగ, బొప్పాయి పసుపుకు రూ. లక్ష వరకు వ్యయం అయ్యింది. వరద ముంపునకు గురవ్వడంతో పంట మొత్తం దెబ్బతింది. సొంత భూములున్న రైతులకన్నా కౌలు రైతులు రెట్టింపు నష్టపోయారు. ఈ భూములు సాగు చేసే కౌలు రైతుల్లో అత్యధికులకు సిసిఆర్‌సి కార్డు లేదు. దీంతో క్షేత్రస్థాయిలో కౌలు రైతులు నష్టపోయినా పరిహారం మాత్రం భూ యజమానికి వెళ్లే పరిస్థితి నెలకొంది.కౌలు రైతులను గుర్తించాలని వీరు కోరుతున్నారు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టారు. సిసిఆర్‌సి కార్డు లేదు. కౌలు రైతులను గుర్తించి పరిహారం ఇస్తేనే కొద్దిగా ఊరట దొరుకుతుంది. ఏడాది మార్కెట్‌లో ధర ఆశాజనకంగా ఉందని కొందరు వివిధ రకాల పంట సాగు చేశారు. భూ యజమానికి ముందుగానే ఎకరాకు రూ. 40 వేలు చొప్పున చెల్లించారు. పంట సాగుకు ఎకరాకు రూ. 60 వేలు చొప్పున పెట్టుబడి పెట్టారు. లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్న పంట వరదకు మునిగిపోయింది. ముందుగా కౌలు చెల్లించడంతో సాధారణ రైతు కన్నా రెట్టింపు నష్టం వచ్చింది. ప్రభుత్వ ఆదుకోవాలి.