ఉద్యాన రైతులకు రాయితీ

సిద్దిపేట,నవంబర్‌18(జ‌నంసాక్షి): పాలిహౌస్‌ నిర్మాణానికి అయ్యే ఖర్చులో 95 శాతం నిధులను ప్రభుత్వం భరిస్తుందని, అందువల్ల రైతులు దీనిపై అవగాహన పెంచుకోవాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి అన్నారు. మిగిలిన 5 శాతం నిధులను రైతులు చెల్లించాల్సి ఉంటుంది. పాలిహౌస్‌లలో సంవత్సరం పొడవునా అన్ని కాలాల్లో తక్కువ ఖర్చుతో కూరగాయల పంటలు, పూల సాగును చేసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం ఇచ్చే పలు రాయితీల వివరాలను వెల్లడించారు. పాలిహౌస్‌(గ్రీన్‌హౌస్‌)లు నిర్మించుకునే సాధారణ రైతులకు నిర్మాణానికి అయ్యే ఖర్చులో 75 శాతం ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన 25 శాతం నిధులను రైతులు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన రైతులకు పాలిహౌస్‌ నిర్మాణానికి 95 శాతం రాయితీ ఇస్తున్నారు. వీటిలో సాగు చేసిన పంటలకు అవసరమైన వాతావరణం లభిస్తున్నందున దిగుబడులు కూడా ఆశించిన దానికంటే ఎక్కువగా వస్తాయని వివరించారు. ఈ పాలిహౌస్‌లు నిర్మించుకునేందుకు రైతులు వెంటనే దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఉద్యాన పంటలు మల్చింగ్‌ విధానంలో సాగు చేసుకునే రైతులకు రాయితీలు ఇస్తున్నారు. ఒక హెక్టారు పొలంలో మల్చింగ్‌ ఏర్పాటు చేసుకునేందుకు రూ.16 వేల రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. పరికరాలపై సాధారణ రైతులకు 40 శాతం రాయితీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల రైతులతోపాటు సహకార సంఘాలు, మహిళ సంఘాలకు 50 శాతం రాయితీపై అందిస్తున్నారు.