ఉద్యోగావకాశాలు కల్పించడమంటే ..

లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వడం కాదు’
– నేను ప్రజలను రెచ్చగొట్టేవాడిని కాదు
– అలాంటి తత్వమే ఉంటే విూకెందుకు మద్దతు ఇచ్చేవాణ్ణి
– సమస్యలపై నిలదీయటం తప్పా?
– ఇసుక దోపిడీ ఆపేయకపోతే.. కొన్నేళ్లకు ఉత్తరాంధ్రలోని 19నదులు మాయమవుతాయి
– విజయనగరం సభలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌
విజయనగరం, జూన్‌2(జ‌నం సాక్షి) : యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమంటే లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వటం కాదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. శనివారం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ప్రసంగించిన పవన్‌ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించారు. నిరుద్యోగ సమస్యను లేవనెత్తిన పవన్‌ కల్యాణ్‌.. ఉద్యోగావకాశాలు కల్పించడమంటే విూ అబ్బాయి లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వడమా అని ప్రశ్నించారు. మొత్తం ప్రజలందరికీ ఉద్యోగాలు ఇవ్వాలంటూ సీఎంకు చురకలు అంటించారు. వైసీపీ వస్తే భూకబ్జాలు, అక్రమ గనుల తవ్వకాలు, అవినీతి కార్యకలాపాలు పెరిగిపోతాయని, టీడీపీ వస్తే అవినీతికి తావు ఉండదని గతంలో చంద్రబాబు చెప్పాడరని పవన్‌ గుర్తుచేశారు. కానీ విూరు వైసీపీ నాయకులను మించిపోయారని విమర్శించారు. నలభై ఏళ్ల విూ సుదీర్ఘ అనుభవం ఇసుక మాఫియాకు చట్టబద్ధత కల్పించడానికి ఉపయోగపడిందా అని ప్రశ్నించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే గారే భార్య పేరిట ఇసుకను తవ్వేస్తున్నారు. అది అవినీతి కాదా? అరాచకం కాదా? అని పవన్‌ ప్రశ్నించారు. పవన్‌ ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని నవ నిర్మాణ దీక్షలో సీఎం అంటున్నాడు.. ఉత్తరాంధ్ర ప్రజలు నా కుటుంబ సభ్యులు.. బలహీనులకు అండగా ఉండకపోతే ఎవరికి అండగా ఉండాలి అంటూ పవన్‌ చంద్రబాబును నిలదీశాడు. నేను రెచ్చగొట్టను, రెచ్చగొట్టే తత్వం ఉంటే విూకెందుకు మద్దతు ప్రకటించే వాణ్ని అంటూ ప్రశ్నించారు. ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పిస్తే.. మిమ్మల్ని ఎందుకు నిలదీస్తాను? అని పవన్‌ ఆవేశంగా ప్రశ్నించారు. అవినీతి ఎక్కడ ఉందని సీఎం అడుగుతున్నారు. గరివిడి మాంగనీస్‌ గనులను చూడండి. ఇక్కడ ఎవరికీ అనుమతులు లేవు. ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుండగా..
టీడీపీ నేతలకు లబ్ధి చేకూరుతోంది. మైనింగ్‌ శాఖ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లడం అవినీతి కాదా..? అని జనసేనాని ప్రశ్నించారు. కార్మికులకు భద్రత కావాలి. విూరెంత సేపు పారిశ్రామిక వేత్తల కష్టాలే తప్ప కార్మికులను పట్టించుకోవడం లేదు. ఫెర్రో అల్లాయిస్‌, జ్యూట్‌ మిల్లులు మూతపడుతున్నాయి. జనసేన కార్మికులు అండగా ఉంటుంది. విూ సమస్యను అధ్యయనం చేస్తాం. విూకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం అంటూ పవన్‌ పేర్కొన్నారు. జనసేన ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పిస్తుందని పవన్‌ హావిూ ఇచ్చారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటే.. ప్రభుత్వంలో ఉండగానే దోచేసుకుందాం అని టీడీపీ భావిస్తోంది. ఇసుక దోపిడీ ఆపేయకపోతే.. 2050 నాటికి ఉత్తరాంధ్రలోని 19 నదులు మాయం అవుతాయని పవన్‌ అన్నారు. చంద్రన్న బీమా పథకం ప్రయోజనాలు కింది స్థాయికి వెళ్లడం లేదని పవన్‌ తెలిపారు.