ఉద్రిక్తతల మధ్య హైదరాబాద్‌కు అక్బరుద్దీన్
అనారోగ్య కారణాలు చూపుతూ విచారణకు గైర్హాజరు
ఆరోగ్య పరీక్షలు జరిపి విచారిస్తాం : పోలీసులు
హైదరాబాద్/ఆదిలాబాద్, జనవరి 7 (జనంసాక్షి) :
వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ పోలీసుల విచారణకు హాజరు కాలేదు. ఆరోగ్య కారణాల రీత్య తాను విచారణకు హాజరయ్యేందుకు గడువు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తాను అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నానని, నాలుగు రోజులు గడువు ఇవ్వాలని పోలీసులను కోరారు. ఈ మేరకు తన తరఫున ఇద్దరు లాయర్లను నిర్మల్ పోలీసుస్టేషన్‌కు పంపించారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్‌కు నిర్మల్ పోలీసులు గత వారం నోటీసులు జారీ చేశారు. సోమవారం తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. అయితే, అనారోగ్య సమస్యల కారణంగా తాను విచారణకు హాజరు కాలేక పోతున్నానని అక్బర్ తెలిపారు. ఈ మేరకు తన న్యాయవాదులు మహమ్మద్ ఇస్మాయిల్, సత్తార్‌ఖాన్ ద్వారా పోలీసులకు సమాచారం పంపారు. సోమవారం ఉదయం 10.30కు నిర్మల్ పోలీసుస్టేషన్‌కు చేరుకున్న న్యాయవాదులు.. అక్బర్ వినతిని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. నాలుగు రోజుల గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వైద్య పరీక్షల కోసమే ఆయన లండన్ వెళ్లాడని, దీన్ని దృష్టిలో ఉంచుకొని గడువు పొడిగించాలని కోరారు. తదుపరి విచారణకు పోలీసులు నిర్ణయించిన తేదీల్లో హాజరవుతారని తెలిపారు.ఈ మేరకు పోలీసులకు ఓ నోట్ సమర్పించినట్లు తెలిసింది. అక్బరుద్దీన్ మంగళవారం నిజామాబాద్ పోలీసుల ఎదుట హాజరవుతారని, తర్వాతి రోజు నిర్మల్ పోలీసుస్టేషన్‌కు వస్తారని చెప్పినట్లు తెలిసింది. అయితే, వారి వినతికి పోలీసులు అంగీకరించలదు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు హైదరాబాద్ పశ్చిమ మండల డీసీపీ సుధీర్‌బాబు అక్బర్ నివాసానికి చేరుకొని పరిస్థితిని తెలుసుకున్నారు. నిర్మల్ పోలీసులతో కలిసివచ్చిన వరంగల్ రేంజి ఐజీ వెంకటేశ్వర్‌రావు అక్బర్ నివాసానికి వచ్చి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. మంగళవారం ఉదయం ప్రభుత్వ వైద్యుడితో పరీక్షించి నివేదిక ఆధారంగా విచారణ విషయం వెల్లడిస్తామన్నారు. ఇప్పుడైతే అక్బర్ ఆరోగ్యగాంగానే కన్పిస్తున్నాడని తెలిపారు. సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు ఖతార్ ఎయిర్‌లైన్స్‌లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు ఎంఐఎం ఎమ్మెల్యేలు, మద్దతుదారులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి అక్బర్ నేరుగా బంజారాహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. అనంతరం తన న్యాయవాదులు, మద్దతుదారులతో భేటీ అయ్యారు. ఏం చేయాలనే దానిపై తన సోదరుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. చివరకు అక్బర్ తరఫున న్యాయవాదులను నిర్మల్ పోలీసుస్టేషన్‌కు పంపించాలని నిర్ణయించారు. లాయర్లు బయల్దేరిన కొద్దిసేపటికే, ఒవైసీ ఆస్పత్రికి చెందిన వైద్య బృందం అక్బరుద్దీన్ నివాసానికి చేరుకుంది. ఇంట్లోనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పోలీసుల విచారణను తప్పించుకొనేందుకే అక్బర్ అనారోగ్య కారణాలు చూపుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఓ వర్గం వారి ఆగ్రహానికి కారణమైన అక్బరుద్దీన్‌కు పోలీసులు భారీగా భద్రత కల్పించారు. ఆయన ఇంటి వద్ద బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పాతబస్తీలో కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు.
పక్కా వ్యూహంతోనే ఒవైసీ విచారణకు హాజరు కాలేదని సమాచారం. విచారణ నుంచి తప్పించుకునేందుకే ఆరోగ్య సమస్యలను కారణంగా చూపుతున్నారని తెలుస్తోంది. ముందస్తు వ్యూహం ప్రకారమే నిర్మల్ వెళ్లకుండా, తన తరఫున న్యాయవాదులను పంపినట్లు తెలిసింది. ఇప్పటికే వివిధ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదైన నేపథ్యంలో… ఆయా పోలీసుస్టేషన్లకు వెళ్లి విచారణకు హాజరు కావడానికి బదులు కోర్టులో లొంగిపోవాలని భావిస్తున్నట్లు సమాచారం. తన సోదరుడు అసదుద్దీన్ ఒవైసీ చర్చల అనంతరం విచారణకు హాజరు కాకూడదని అక్బర్ నిర్ణయించుకున్నారు. ఆరోగ్య సమస్యల పేరుతో నాలుగు రోజుల పాటు విచారణకు దూరంగా ఉండడం, ఆలోపు తదుపరి వ్యూహ రచన పూర్తి చేసుకోవాలన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఒవైసీని తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నిర్మల్, నిజామాబాద్ పోలీసులు ఆదేశించారు. గత నెలలో నిజామాబాద్, నిర్మల్‌లలో జరిగిన బహిరంగ సభల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా, ఇతరుల విశ్వాసాలను దెబ్బ తీసేలా వ్యాఖ్యానించిన అక్బరుద్దీన్‌కు ఆయా ప్రాంతాల పోలీసులు ఈ నెల 7, 8 తేదీల్లో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. మరోవైపు, కోర్టు ఆదేశాల మేరకు ఉస్మానియా యూనివర్సిటీ, ఎల్బీనగర్ పోలీసులు అక్బరుద్దీన్‌పై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 153 (ఏ) కింద ఆయనపై కేసు నమోదైంది. అటు ఢిల్లలోనూ ఓ కేసు నమోదైంది. ఈ కేసులన్నింటిలో విచారణకు హాజరు కావడానికి బదులు కోర్టులో లొంగిపోవడమే మేలని అక్బర్ యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై న్యాయ నిపుణుల సలహా తీసుకొని ముందుకు వెళ్లాలని ఒవైసీ సోదరులు నిర్ణయించారు.