ఉపరాష్ట్రపతిగా అన్సారీ
న్యూఢిల్లీ: ఊహించనట్లుగానే భారత ఉప రాష్రపతిగా హమీద్ అన్సారీ రెండోసారి ఎన్నికయ్యారు. యుపిఏ అభ్యర్దిగా పోటీ చేసిన ఆయన ఏన్డీయే అభ్యర్ది జస్వంత్‌సింగ్‌పై విజయం సాధించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలీంగ్ మంగళవారం ఉదయం ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగిసింది. సాయంత్రం ఈ ఎన్నికల ఫళితాలు వెల్లడయ్యాయి. పార్లమెంట్ సెంట్రల్‌హాల్లో పోలింగ్ జరగగా మొత్తం 736 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీటిలో ఎనిమిది ఓట్లు చెల్లలేదు. అన్సారీకి 490 ఓట్లు రాగా, జస్వంత్‌కు 238 ఓట్లు వచ్చాయి. తొలి ఓటును రాష్ట్రానికి చెందిన నర్సాపురం కాంగ్రెస్ ఎంపీ కనుమూరి బాపిరాజు వేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. యూపీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్దిగా బరిలోకి దిగిన అన్సారీ, ఏన్డీయే తరపున అభ్యర్ది జస్వంత్ సింగితో పోటీపడ్డారు. ఈ ఎన్నికలకు టీడీపీ, వైయస్సార్ సీపీ, టీఆర్‌ఎస్ లు దూరంగా ఉన్నాయి. యుపిఏ భాగస్వామ్య పక్షాలతో పాటు, బయట నుండి మద్దతు ఇస్తున్న ఎస్పీ, బీఎస్పీ తదితర పార్టీలు అన్సారీకే ఓటు వేశాయి. దేశ 14వ ఉప రాష్ట్రపతిగా అన్సారీ ఎన్నికయ్యారు.ఈ నేపథ్యంలోనే యూపీఏ భాగస్వామ్య పక్షాలు బయటి నుంచి మద్ధతు ఇస్తున్న పార్టీల ఎంపీలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలోని హోటాల్ అశోకాలో విందు ఇచ్చారు. దీనికి రాజకీయ బద్ధ విరోధులైన ఎస్పీ అధినేత ములాయం సింగ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలు హాజరయ్యారు. మరో భాగస్వామ్య పక్షమైన తృణమూల్ మంతృలు సుదీప్ బందోపద్యాయ, సీఎం జతువాలతో పాటు పార్టీ ఎంపీలంతా సోనియా ఇచ్చిన విందు భేటీకి హజరయ్యారు. అయితే, డిల్లీలో లేకపోవడంతో ఎన్సీపీ నేతలు శరత్ పవార్, ప్రపుల్ పటేల్‌లు ఈ విందుకు హాజరు కాలేదు. కాగా..తమ పార్టీ మద్ధతు ఎన్డీయే అభ్యర్ధి జస్వంత్‌కేనని అన్నాడియంకె అధినేత్రి తమిళనాడు సీఎం జయలలిత ప్రకటించారు. ఎన్నికలకె దూరంగా ఉండాలని బిజూ జనతాదల్ నిర్ణయించింది.