ఉపరాష్ట్రపతిగా మరోసారి అన్సారికే చాన్స్ ?
న్యూఢిల్లీ, జూలై 9 (జనంసాక్షి): ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా తిరిగి హమీద్ అన్సారీనే ప్రతిపాదించేందుకు కాంగ్రెస్‌పార్టీ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కోర్ కమిటీలో ఈ పదవి కోసం అన్సారి పేరును చర్చించారు. అన్సారీ అభ్యర్ధిత్వంపై లెఫ్ట్ ఫ్రంట్, సమాజ్‌వాది పార్టీ, బిఎస్‌పి, జెడిఎస్, జెడియు పార్టీలతో కాంగ్రెస్ ఇప్పటికే చర్చించిందని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి. అన్సారీ అభ్యర్థిత్వాన్ని ఈ పార్టీలు కూడా ఆమోదించాయని ఆ వర్గాలు తెలిపాయి. దీంతో అన్సారీకి మద్దతు బాగానే ఉండడంతో పార్టీ సంతోషం వ్యక్తం చేసింది. అయితే అన్సారీ అభ్యర్థిత్వంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కాంగ్రెస్ పార్టీఇంకా చర్చించలేదు. అన్సారీ అభ్యర్థిత్వం పట్ల పలు పార్టీలు మద్దతు తెలుపుతున్నందున తృణమూల్ మద్దతు కోసం కాంగ్రెస్ పెద్దగా పట్టుబట్టడం లేదు. ఆశించనూ లేదు. రాష్ట్రపతి అభ్యర్ధిగానే అన్సారీ పేరు వార్తలోకెక్కింది. ప్రణబ్‌ముఖర్జీ పేరును అధికారికంగా ప్రకటించే వరకు అన్సారీ పేరు కూడా షికారు చేసింది. ఆగస్టు 7వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనున్నది. అదే రోజు ఫలితం వెలువడనున్నది. ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఉన్న అన్సారీ పదవీ కాలం ఆగస్టు 10వ తేదీతో ముగియనున్నది. ఉప రాష్ట్రపతిని పార్లమెంటు ఉభయ సభల్లోని ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఎన్నుకుంటారు. రాష్ట్రపతి ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్ హక్కు లేకపోయినప్పటికీ ఉప రాష్ట్రపతి ఎన్నికలో వీరికి ఓటింగ్ హక్కు కల్పించారు. ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా కనీసం 20 మంది సభ్యులు పేరును ప్రతిపాదిం చాల్సి ఉంది. ఎంత మందయినా బలపరచవచ్చు.