ఉపాధి అవకాశాల కోసం యువత చూపు

మహబూబాబాద్‌,నవంబర్‌8(జ‌నంసాక్షి): పోరాటం చేసి సాధించుకున్న ప్రత్యేక జిల్లాతోనైనా తమకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని ఇక్కడి యువత ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇందుకు అవకాశాలు సైతం ఎన్నో ఈ జిల్లాలో ఉన్నాయి. ఇంజినీరింగ్‌, ఫార్మసీ, పీజీ తదితర విద్యాసంస్థలు ఉన్నాయి. ఈ జిల్లాలో ఐటీ, ఫార్మా, ఎలక్ట్రికల్‌ తదితర కంపెనీలు ఏర్పాటయ్యేలా ప్రభుత్వం కృషి చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు. పోరాడి సాధించుకున్న జిల్లాతో తమకు మేలు జరిగిందన్నారు. పోరటాలకు, అనేక ఉద్యమాలకు, ఎక్కువ మంది గిరిజనులకు.. మరెన్నో ప్రత్యేకతలకు నిలయమైన మహబూబాద్‌ జిల్లాలో యువత విద్యలో ముందంజలో ఉన్నారు. వీరిలో ఎక్కువ మందికి స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు తరలిపోయి వివిధ రకాల పనులు చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన ప్రత్యేక జిల్లాతోనైనా స్థానికంగానే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావిస్తుంది. మరి ముఖ్యంగా దిల్లీ-చెన్నై రైల్వే మార్గం ఈ జిల్లా నుంచే ఉండటంతో పరిశ్రమలకు అనుకూలంగా ఉంటుంది. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయడంతోపాటు, రైల్వేకు సంబంధించిన పరిశ్రమలు కూడా ఇక్కడకు వచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలని యువత కోరుకుంటుంది. అప్పుడే ఈ జిల్లాలో ఉన్న యువతకు సరైన ఉపాధి అవకాశాలు దరి చేరుతాయని వారు అంటున్నారు.ఈ ప్రాంతం యువకులు ఎక్కువగా ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్‌ పైనే ఆధారపడుతుంటారు. ఎక్కువ మంది రాష్ట్ర రాజధానికి రైళ్లలో వెళ్తుంటారు. కొంతమంది స్థానికంగా ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటారు.