ఉపాధి కూలీలకు డబ్బు చెల్లింపులో ఆలస్యం

మహబూబ్‌నగర్‌,జ‌నంసాక్షి): ఉపాధి కింద పనిచేసిన వారికి ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చే కూలీ డబ్బులు ఇప్పుడు సరిగా రావడం లేదని కూలీలు వాపోతున్నారు. పని చేసిన రోజులకు సంబంధించిన కూలీ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఉపాధిహావిూ పథకంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా డబ్బులు నిలిచిపోయాయని సమాచారం. గత నెల రోజుల నుంచి ఈ కూలీ డబ్బులు రాకపోవడంతో నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయం పెద్దగా లేని ఈ తరుణంలో కూలీలకు ఉపాధి పనులే వీరికి ఆసరాగా నిలిచినా డబ్బులు రాకపోయినా నిత్యం ఎండలో కష్టపడుతున్నారు. మరోవైపు.. పని చేయడానికి సిద్ధంగా ఉన్న చాలా గ్రామాల్లొ నిరుపేదలకు ఉపాధి సిబ్బంది పనులు చూపడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఉపాధిహావిూ కింద ఎర్రటి ఎండలో ఎనిమిది గంటలు కష్టపడి పనిచేసినా సగటు కూలీ రూ.180 వచ్చే అవకాశం కూఆ లేదు. ఒక్కొక్కరికి వేసవి కరవు భత్యంతో కలుపుకొని రూ.150 కూడా రాని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఈ పథకం కింద పని చేస్తున్న కూలీలకు తాగునీటి అలవెన్సులు, వేసవి కరవు భత్యం కలుపుకొన్నా ప్రస్తుతం రోజుకు రూ.133.87 కూలీ గిడుతోంది. ప్రతి కూలీకి ఏడాదిలో వంద రోజులు పని కల్పిస్తారు.వీరికి తాగునీరు, ఎండ నుంచి రక్షణకు గుడారాల ఏర్పాటు వంటి కనీస సౌకర్యాలు కూడా లేవు. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ప్రథమ చికిత్స చేయడానికి ఆరోగ్య కిట్లు అందుబాటులో లేవు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు లక్షన్నర కూలీలు రోజూ పనులకు వస్తూనే ఉన్నారు. అయితే డబ్బులురాగానే త్వరలోనే చెల్లిస్తామని అధికారులు అన్నారు.