ఉప ఎన్నికల ఫలితాల్లో ఎవరిసీట్లు వారికే

న్యూఢిల్లీ,ఫిబ్రవరి16(  జ‌నంసాక్షి ): ఎవరి సీట్లు వారికే అన్నట్లుగా ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. గోవా రాష్ట్రంలోని పనాజి శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ విజయభేరీ మోగించింది. గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌కు కేంద్ర కేబినెట్‌లో చోటు లభించడంతో సీఎం పదవితో సహా, తాను ప్రాతినిధ్యం వహించిన పనాజీ శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. దీంతో పనాజి ఉపఎన్నిక అనివార్యమైంది. మరోవైపు తమిళనాడులోని శ్రీరంగం శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో అన్నా డీఎంకే పార్టీ అభ్యర్ధి ఘన విజయం సాధించింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమ సంపాదన కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. జయలలిత అరెస్ట్‌ అవడమే కాకుండా ఆమె శాసనసభ్యత్వం కూడా రద్దు కావడంతో శ్రీరంగంలో ఎన్నిక అనివార్యమైంది. అరుణాచల ప్రదేశ్‌లోని లిరోమొబా అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. కాంగ్రెస్‌ అభ్యర్థి న్యామర్‌ కార్బాక్‌ తన సవిూప భాజపా ప్రత్యర్థిపై కేవలం 119 ఓట్ల ఆధిక్యంతో విజయం

సాధించారు. ఉప ఎన్నికల అధికారి డీజే భట్టాచార్య తెలిపిన వివరాల ప్రకారం.. కర్బాక్‌కు 3,808 ఓట్లు రాగా భాజపా అభ్యర్థి బైగాడీకి 3,689 ఓట్లు వచ్చాయి. తొమ్మిది మంది ఓటర్లు నోటా విూట నొక్కారు. ఇక తిరుపతిలో టిడిపి అభ్యర్థి సుగుణమ్మ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ నాలుగు సీట్లు గతంలో ఆయాపారర్టీల అభ్యర్థులు ప్రాతినిధ్యం వహించారు.