ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటవీ రక్షణకు చర్యలు
కలప స్మగ్లర్లకు అరదండాలి
ఆదిలాబాద్,జనవరి28(జనంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటవీ రోణతో పాటు, శాంతిభద్రతలపై ఇరు వాఖలకు చెందిన అదికారులు ముమ్మర చర్యలు తీసుకున్నారు. అటు అడవుల్లో నరకివేతల నివారణకు కార్యాచరణ చేపట్టారు. ఇటు పోలీసులు శాంతిభద్రతల విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తున్నారు. సిఎం కెసిఆర్ ఆదేశాలతొ చర్యలకు ఉపక్రమించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు మందస్తుగా ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్‌పీ విష్ణు వారియర్ తెలిపారు. ఎవరైనా అనుమానితులు నివాసమున్నా ముందస్తుగా తెలుసుకొని చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు గుర్తు తెలియని, అనుమానాస్పదంగా ఉన్న వారికి ఇంటి అద్దె ఇవ్వద్దని సూచించారు. ఇకపోతే స్మగ్లర్లు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేయటంతో అక్రమ కలప తరలింపును నిరోధించటానికి జిల్లాలో అధికారులు చర్యలు ప్రారంభించారు. జిల్లా అటవీ అధికారి బి.ప్రభాకర్ నేతృత్వంలో జిల్లాలోని అటవీ క్షేత్రాధికారులు, సెక్షన్ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్రమ కలప రవాణా విషయమై చర్చించారు. ప్రస్తుతం ఉన్న అటవీ చెక్‌పోస్టుల పనితీరు, వాటిని బలోపేతం చేయటం, కొత్త చెక్‌పోస్టుల ఏర్పాటు విషయమై చర్చించారు. టేకు అక్రమ రవాణా చేసే వారిని గుర్తించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇప్పటికే టేకు కలప స్మగ్లర్‌పై తొలి పీడీ కేసును జిల్లా పోలీసులు నమోదు చేసారు. ఇకపోతే ఇటీవల నిర్మల్‌లో పోలీసులు పట్టుకున్న కలప వ్యవహారం కలకలంగా మారిన విషయం తెలిసిందే. ఇందులో పోలీసులతో పాటు అటవీ అధికారుల హస్తం ఉన్నట్లు రూఢీ అయినట్లు తెలిసింది. దీంతో రాష్ట్ర స్థాయిలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో కలప అక్రమ తరలింపును సవాల్‌గా తీసుకొని రహస్యంగా దర్యాఫ్తు చేస్తోంది. ఈ వ్యవహారంలో ఎవరెవరి హస్తం ఉందన్నది లోతుగా శోధిస్తున్నారు. దీంతో అక్రమార్కులైన అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు ప్రత్యేకంగా ఈ విషయంపై దృష్టి సారించారు. మరోవైపు జైపూర్ మండలంలోని శివ్వారంలో పులిని హతమార్చి చర్మం అమ్మడానికి ప్రయత్నించిన కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ చేసినట్టు జిల్లా అటవీ శాఖ అధికారి రామలింగం తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామారావుపల్లికి చెందిన మేకల నర్సయ్య (ఎ3), మంథనిలోని నాగారంకు చెందిన బిచుపల్లి కొమరయ్య (ఎ4), నర్సింగోజుల రవీందర్ (ఎ5), దండవేని సాయిలు (ఎ6) ఉన్నారని తెలిపారు. ఈ నెల 24న మందమర్రిలో పులి చర్మం అమ్ముతుండగా నిందితులను పట్టుకుని విచారణ చేపట్టామన్నారు. శివ్వారం గ్రామానికి చెందిన దండవేని సాయిలు పులిని చంపినట్టు తెలిసిందన్నారు. పులి చర్మం తీసిన ప్రదేశం, కరెంటు తీగలు పెట్టిన స్థలం, పులి గోళ్లు పాదాలు దాచిన స్థలాన్ని పరిశీలించామని చెప్పారు. ఈ కేసులో మందమర్రిలోని రామన్‌నగర్‌కు చెందిన ఐలవేని అంజయ్య (ఎ1), గోదావరిఖనిలోని తిలక్‌నగర్‌కు చెందిన పూర్ణఐలవేని సాగర్ (ఎ2) ప్రధాన నిందితులుగా ఉన్నారని చెప్పారు. వీరితో పాటు తోకల మల్లయ్య, తోకల బుచ్చిరాజం, మంచిర్యాలకు చెందిన నర్సింగోజుల రవీందర్ పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. మిగతా వారిని కూడా త్వరలో అరెస్టు చేసి రిమాండ్ చేస్తామని చెప్పారు. అటవీ సంపదను కొల్లగొట్టే వారిపై జిల్లా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడానికి సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే పలు చర్యలు ప్రారంభించిన పోలీసులు జిల్లా పాలనాధికారి దివ్య దేవరాజన్ అనుమతితో సిరికొండ మండలం
కేశవపట్నం గ్రామానికి చెందిన శేఖ్ షబ్బీర్(30) అనే కలప స్మగ్లర్‌పై పీడీ చట్టం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈయనపై 21 అక్రమ కేసులు నమోదై ఉన్నాయి. ఈ మేరకు షేక్ షబ్బీర్‌ను పోలీసులు ఆదివారం ఆరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఎస్‌పీ విష్ణు వారియర్ మాట్లాడుతూ మరి కొందరు కలప స్మగ్లర్లపై పీడీ కేసులు నమోదు చేయనున్నట్లు స్పష్టం చేశారు. కలప అక్రమ రవాణాకు పాల్పడే వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవటానికి వెనుకాడమన్నారు. కలప అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో నిర్మూలించటానికి స్వయం పర్యవేక్షణలో నిఘాను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అటవీ, పోలీసు అధికారులు ఉమ్మడిగా ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి సాయుధ పోలీసులతో అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టి పకడ్బందీగా అడ్డుకుంటామని అన్నారు.