ఉమ్మడి జిల్లాలో పెరిగిన టిఆర్‌ఎస్‌ ప్రచారం

ఎక్కడికి వెళ్లినా అభివృద్ది కార్యక్రమాలపై వివరణ

ప్రచారంలో దూసుకుపోతున్న ఇద్దరు మంత్రులు

నేడు నాలుగుచోట్ల సిఎం కెసిఆర్‌ ప్రచార సభలు

ఆదిలాబాద్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. ప్రధానంగా ఇద్దరు మంత్రులు ఎక్కడిక్కడ ప్రచారంలో ముందున్నారు. ఆయా నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు జోరుగా ప్రచారం చేపట్టారు. తగినంత సమయం ఉండడంతో గత రెండున్నర నెలలుగా ఏకబిగిన ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వం చేపట్టిన పథకాలను వారికి తెలియజేస్తూ ఓటు వేయాలని కోరుతున్నారు. మహిళలు, స్థానికులు మంగళహారతులు, డప్పు చప్పుళ్లతో ప్రచారంలో పాల్గొంటున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు పేదలకు ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తెలుసుకొనేందుకు ఇతర దేశాలతో పాటు పలు రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు, అధికారులు తెలంగాణకు వస్తున్నారన్నారు. పుట్టిన శిశువు నుంచి వృద్ధుల వరకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక రోడ్డు, ఇతర సౌకర్యాలను కల్పించినట్లు మంత్రులు తమ ప్రచారంలో తెలిపారు. అభివృద్ధి చేసిన తనను ప్రజలు ఆదరించాలని కోరారు. ప్రచారానికి గ్రామాలకు వచ్చిన కాంగ్రెస్‌, బీజేపీ

నాయకులను నిలదీయాలని కోరారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుస్తుందని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధిని మళ్లీ గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధిని చూసే నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు. షాదీముబారక్‌, కల్యాణలక్ష్మీ, కేసీఆర్‌ కిట్‌ వంటి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనన్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ఈనెల 22న ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లోని నాలుగు చోట్ల ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొంటారు. ఖానాపూర్‌, ఇచ్చోడ, నిర్మల్‌, ముథోల్‌లలో కేసీఆర్‌ ఎన్నికల ప్రచార సభలు జరుగనున్నాయి. ఈ మేరకు షెడ్యూల్‌ ఖరారైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా రాష్ట్ర మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డికి ఫోన్‌ చేసి ప్రచార సభల షెడ్యూల్‌ వివరించారు. నాలుగు చోట్ల బహిరంగ సభలను విజయవంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని సూచించినట్లు సమాచారం.రెండు జిల్లాల పరిధిలోని ఐదు నియోజకవర్గాల ప్రజలకు అనువుగా ఉండేలా నాలుగు చోట్ల ప్రచార సభలను ఏర్పాటు చేయడం విశేషం. మంచిర్యాల, కుమురం భీం జిల్లాల్లో మలివిడతలో కేసీఆర్‌ ప్రచార సభలు ఉంటాయని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 22వ తేదీ నాటికి నామినేషన్ల ఉపసంహరణల గడువు కూడా పూర్తికానుంది. పోలింగ్‌కు సరిగ్గా 15 రోజుల ముందు కేసీఆర్‌ ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. ఈ సభలతో నియోజకవర్గాల్లో కొత్త ఉత్సాహం వస్తుందని పార్టీ అభ్యర్థులు భావిస్తున్నారు.