ఉమ్మడి జిల్లాలో ప్రచార ¬రు
పథకాలతో ఆకట్టుకుంటున్న అభ్యర్థులు
మరోమారు గెలిపించాలంటూ ఓటర్లకు వినతి
ఆదిలాబాద్,డిసెంబర్1(జనంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రచార జోరు కొనసాగుతోంది. ఓ వైపు మంత్రులు మరోవైపు అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో పూర్తిస్తాయి ప్రచారంలో మునిగి పోయారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎక్కడికి వెళ్లినా ఆప్యాయంగా పలకరిస్తూ మరోమారు ఓటేసి కెసిఆర్‌ను గెలిపించాలని కోరుతున్నారు. పథకాలు ముందుకు సాగాలంటే కెసిఆర్ సిఎం కావాలన్న ఆకాంక్షను వెల్లడిస్తున్నారు. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో మంత్రి జోగు రామన్న, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులు రాథోడ్ బాపురావు, రేఖానాయక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి జోగు రామన్న వివిధ గ్రామాల్లో జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొనగా.. బోథ్ నియోజకవర్గ అభ్యర్థి రాథోడ్ బాపురావు ప్రచారం చేపట్టారు. గ్రామానికి వచ్చిన మంత్రికి స్థానికులు డప్పుచప్పుళ్లు, పటాకులు కాలుస్తూ ఘనస్వాగతం పలికారు. గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రాంతంలో కనీవిని ఎరగని రీతిలో అభివృద్ధి చెందిందని దాన్ని ఓర్వలేక బీ జేపీ, కాంగ్రెస్ నాయకులు తమపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని అన్నారు తమ మనుగడ కోల్పోతామని భయంతో ప్రజలను మభ్యపెట్టేందుకు మాయామాటలు చెబుతున్నారన్నారు. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో ప్రజలు గమనిస్తున్నారని, ప్రలోభాలకు గురి చేసినంత మాత్రాన కుట్రలు, కుతంత్రాలకు పా ల్పడిన వారికి ఓటు వేసే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మండలాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రచారం చేస్తున్నారు. గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ.. పెన్‌గంగ ప్రాజెక్టు సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైందని, భీంపూర్ మండలం పిప్పల్‌కోటి వద్ద ప్రధానకాలువల నిర్మాణం దాదాపుగా పూర్తి కావస్తున్నదని, పిప్పల్‌కోటి , గోముత్రి రిజర్వాయర్లను స్వయాన సీఎం కేసీఆర్ బహిరంగ సభలో మంజూరు చేశారని, వీటన్నింటితో సస్యశ్యామలం కానున్నదని పేర్కొన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మరోసారి తెలంగాణ ప్రభుత్వం రావాలని ఖానాపూర్ అభ్యర్థి రేఖా నాయక్ అన్నారు. దేశంలో లేనివిధంగా రైతుబంధు, రైతు బీమా, నిరంతర విద్యుత్ రైతులకు ఎంతో మేలు కలిగించాయన్నారు. సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ రాష్ట్రం
మరింత ప్రగతి సాధిస్తోందని ఇంద్రకరణ్ రెడ్డి గుర్తుచేశారు. రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి కూడా గుర్తించిందన్నారు. ఆయన టీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి ఉదయం నుంచి రాత్రి వరకు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. ప్రతి చోటా డప్పువాద్యాలతో స్వాగతం పలికారు. చెరువులు, ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమాతో ఇది అసలు సిసలు రైతురాజ్యమని స్పష్టం చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు ప్రతి కుటుంబంలో సంతోషం నింపాయన్నారు. మరింత ప్రగతి కోసం అన్ని వర్గాలు కారుగుర్తుకే ఓటేసి భారీ మెజారిటీ ఇవ్వాలని కోరారు. మాయమాటలు నమ్మి మోస పోవద్దని సూచించారు.