ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో జోష్
రాహుల్ పర్యటనతో మారనున్న రాజకీయం
వ్యూహాత్మకంగా గ్రావిూణ ప్రాంతం ఎంపిక
ఉత్తర తెలంగాణలో పట్టు పెరుగుతుందన్న ధీమా
ఆదిలాబాద్,అక్టోబర్15(జనంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్‌లో జోష్ పెరిగింది. రాహుల్ జిల్లా పర్యటన ఖరారు కావడంతో శ్రేణులు ఆనందంలో ఉన్నారు. ఇప్పటికే జిల్లాలో రాజకీయ పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయని అంతా భావిస్తున్నారు. అందుకే అన్ని నియోజకవర్గాల్లో టిక్కెటల్ కోసం కాంగ్రెస్లో పోటీ పెరిగింది. ఒక్కో నియోజకవర్గంలో కనీసం ఐదుగురు పోటో పడుతున్నారు. ఏ నియోజవర్గంలో ఎవరు పోటీ చేస్తారన్నది ఇంకా ఖరారు కాలేదు. అయినా ప్రచారలు సాగుతున్నాయి. ఈ దశలో రాహుల్ పర్యటన కూడా ఖరారయ్యింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆదిలాబాద్ జిల్లా పర్యటన ఖరారైంది. బోథ్ నియోజకవర్గంలోని నేరడిగొండలో ఈనెల 20న బహిరంగసభను ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఉత్తర తెలంగాణలో పార్టీకి ఊపు రాగలదని అంతా భావిస్తున్నారు. దీంతో ఉత్తర తెలంగాణలో రాహుల్‌గాంధీతో ఏర్పాటు చేస్తున్న తొలి ఎన్నికల ప్రచారసభను
ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నాలుగు జిల్లాల నుంచి భారీ ఎత్తున జన సవిూకరణ జరపడం ద్వారా ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ సత్తా చాటాలని భావిస్తున్నారు. ఈ మేరకు సభా ప్రాంగణాన్ని ఏఐసీసీ కార్యదర్శులు శ్రీనివాసన్ కృష్ణన్, బొస్రాజ్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తదితరులు ఇప్పటికే పరిశీలించి ఖరారు చేశారు. నేరడిగొండలోనే పీఏసీఎస్ కార్యాలయం వెనుక గల స్థలాన్ని సభ కోసం ఖరారు చేశారు. జిన్నింగ్ మిల్లు వద్ద గల స్థలం హెలిప్యాడ్ నిర్మాణానికి అనువుగా ఉంటుందని తేల్చారు. దసరా తరువాత నిర్వహిస్తున్న ఈ సభ ద్వారా కాంగ్రెస్ పట్ల ప్రజానీకంలో గట్టి నమ్మకాన్ని కలిగించాలని నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో దసరా లోపు టికెట్లు ఖరారు అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో పోటాపోటీగా ఆశావహులు జనాన్ని తరలించే అవకాశం ఉంది. మొత్తం ఉత్తర తెలంగాణ కేంద్రంగా ఈ సభను నిర్వహించాలని సూచస్తున్నారు. ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాలకే బిజెపి, టిఆర్‌ఎస్ సభలు పరిమితం కాగా, ఇప్పుడు కాంగ్రెస్ గ్రావిూణ ప్రాంతాన్ని ఎన్నుకోవడం గమనార్హం. దీంతో గ్రామాల్లో పాగా వేసేందుకు ఇదో అవకాశంగా భావిస్తున్నారు. ఇకపోతే తెలంగాణ వస్తే ఆదర్శవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని భావించామని.. కానీ ఆశలు అడియాసలు అయ్యాయని కాంగ్రెస్ నేతలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటిపారుదల రంగంలో కాంట్రాక్టర్ల ఆధిపత్యం కొనసాగుతోందన్నాందోళన వ్యక్తం అవుతోంది.