ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోటాపోటీ ప్రచారం

అభ్యర్థులకు అక్కడక్కడా ప్రజా నిరసన

గ్రామాల్లో నేతలను నిలదీస్తున్న జనం

అభివృద్ది నినాదంతో టిఆర్‌ఎస్‌ ముందుకు

టిఆర్‌ఎస్‌ హావిూలను విస్మరించిందన్న కాంగ్రెస్‌

నల్గొండ,నవంబర్‌23(జ‌నంసాక్షి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రచారం వేగం పుంజుకుంది. అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రచారంలో అధికార, విపక్షం అనన తేడా లేకుండా ప్రజలు గ్రామాల్లో నిలదీస్తున్నారు. మా గ్రామానికి ఏం చేశావని అడుగుతున్నారు. అటు కాంగ్రెస్‌, ఇటు టిఆర్‌ఎస్‌ అభ్యర్థలను నిలదీస్తున్నారు. ఇకపోతే తనకు ఇదే చివరి అవకాశమని, గెలిపించాలని స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో ఉన్న మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కోరుతున్నారు. అలాగే ఆలస్యంగా టిక్కెట్‌ దక్కినా విజయం తనదేనని బిసి సంక్షఞేమ సంఘం నేత ఆర్‌. కృష్ణయ్య చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి జిల్లాలకు కెసిఆర్‌ చేసింది శూన్యమని ప్రజాకూటమి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ప్రసంగిస్తుండగా పలువురు యువకులు ఎంపీగా, ఎమ్మెల్సీగా ఉండి ఈ ప్రాంత ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. పార్లమెంటులో కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చామని తెలిపారు. తమకు పదవులు ముఖ్యం కాదని ఎమ్మెల్సీ పదవి మరో మూడేళ్లున్నా ఈ ప్రాంతానికి సేవ చేయడానికి బరిలో నిలిచానని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలకు ఎవరికి ఆపద వచ్చినా సొంత ఖర్చులతో ఆదుకుంటానని హావిూ

ఇచ్చారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా మండలంలో పర్యటిస్తున్న తెరాస అభ్యర్థి గొంగిడి సునీత గురువారం రాత్రి రాజపేటకు చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానికంగా గాంధీకూడలిలో మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేపడుతున్న క్రమంలో ఇక్కడి సర్పంచి తీర్మానాలు ఇవ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. దీంతో సర్పంచి వర్గీయులు తీవ్ర ఆక్షేపణ వ్యక్తపరిచారు. ఏరకంగా అభివృద్ధిని అడ్డుకున్నాడో వివరించాలని సర్పంచి భర్త, భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు వి.అశోక్‌గౌడ్‌ నిలదీశాడు.దీంతో పోలీసులు కలగజేసుకుని పరిస్థితులను చక్కదిద్దారు. అనంతరం ప్రసంగం ముగించి గొంగిడి సునీత వెళ్లారు. తమను అవమాన పరిచినందుకు నిరసనగా భాజపా వర్గీయులు గొంగిడి సునీత దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ విషయమై గొంగిడి సునీత మాట్లాడుతూ కొందరు తనను అప్రతిష్ఠ పాలుజేయడానికి కావాలనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి మరోసారి గెలిపించాలని నల్లగొండ తెరాస అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 20 ఏళ్లుగా కోమటిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నా నియోజక వర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. పెట్టుబడి సాయం కోసం ఎకరానికి రూ.8 వేల చొప్పున తెరాస సర్కారు అందజేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తెరాసకు మళ్లీ పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటలకే పరిమితమయ్యారని కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. నల్గొండ, నకిరేకల్‌, మునుగోడు నియోజకవర్గాలకు నీరు అందించే బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిధుల కేటాయింపులో తెరాస సర్కారు వివక్ష చూపిందని విమర్శిం చారు. కవిూషన్లకు కక్కుర్తి పడి కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. లక్ష కోట్లు కేటాయించారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే బ్రాహ్మణవెల్లం ప్రాజెక్టు పనులను సత్వరమే పూర్తి చేయిస్తామని హావిూ ఇచ్చారు. చివరి నిమిషంలో ప్రజా కూటమి తరపున తనను పోటీ చేయాలని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ ఆదేశించటం తో అనుకోని అతిథిగా ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నట్లు కాంగ్రెస్‌ అభ్యర్థి ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. మిర్యాల గూడలో ఆయన మాట్లాడుతూ రాత్రి వేళలో సమాచారం ఇచ్చి వెంటనే నామినేషన్‌ వేయాలని అధిష్ఠానం ఆదేశించగా వచ్చినట్లు తెలిపారు. 45 ఏళ్లుగా ఎలాంటి పదవి ఆశించకుండా నిరుపేద వర్గాలు, విద్యార్థుల పక్షాన ఉద్యమించానన్నారు. దీని కారణంగానే 6 వేల సంక్షేమ హాస్టళ్లు, 1200 రెసిడెన్షియల్‌ పాఠశాలలు రాష్ట్రంలో ఏర్పాటు చేశారన్నారు. మిర్యాలగూడ నుంచి ప్రజాకూటమి నుంచి బరిలో ఉన్న ఆర్‌.కృష్ణయ్య గెలుపునకు కృషి చేస్తానని రెబల్‌ అభ్యర్థులు చెప్పారు. పార్టీ ఆదేశాలతో తమ నామపత్రాలను విరమించు కున్నట్లు వారు విలేకరులకు చెప్పారు. రెబల్‌ అభ్యర్థి అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధినాయకత్వం కుంతియా, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిలు స్పష్టమైన హావిూ ఇచ్చారని అందుకే రాష్ట్ర ప్రయోజ నాల కోసం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.మహాకూటమి ఆదేశాల మేరకే తప్పుకున్నానని తెజస నాయకుడు గవ్వ విద్యాధర్‌రెడ్డి చెప్పారు. కూటమి అభ్యర్థి గెలుపుకోసం పనిచేస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో పోటీ నుంచి తప్పుకున్నానని మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్‌ చెప్పారు. కృష్ణయ్య విజయానికి పాటుపడు తానని చెప్పారు. కలిసి పనిచేసి విజయం సాధిస్తామని కాంగ్రెస్‌ నాయకుడు పోరెడ్డి శ్రవంత్‌రెడ్డి చెప్పారు. పార్టీ అధిష్ఠానం సూచన మేరకే పోటీ నుంచి వైదొలగినట్లు చెప్పారు. పేదరికం నుంచి వచ్చానని, పేదల కష్టాలు నాకు మాత్రమే తెలుసు.. గతంలో విూ కష్టాల్లో పాలు పంచుకున్నా.. ఇపుడు విూ కోసం పని చేస్తా.. చివరి సారిగా పోటీ చేస్తున్నా.. ఆశీర్వదించాలి అంటూ బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ప్రజలను ఓట్లు అడిగారు. ఇంటింటా తిరుగుతూ

రైతు నాగలి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. దళితులకు మూడెకరాల భూమి, రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తామని హావిూ ఇచ్చిన తెరాస అందరిని మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాకుటమి దే ప్రభంజనమని దేవరకొండ నియోజక వర్గం ప్రజాకూటమి ఎమ్మెల్యే అభ్యర్ధి నేనావత్‌ బాలునాయక్‌ అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసమే సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రమిచ్చారన్నా విషయం మరచి పోకుండా చెయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. దేవరకొండకు సాగు, తాగునీరందిస్తామని కేసీఆర్‌ మూడేళ్ల కిందట ప్రారంభించిన డిండి ఎత్తిపోతల పథకం నేటికీ నీళ్లు ఎక్కడి నుంచి తీసుకుని రావాలనే డిజైన్‌ మార్పుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకొస్తే నిరుపేదలకు ఆరు సిలిండర్లు, రైతులకు రూ.2లక్షల రుణామాఫీ ఒకే దఫామాఫీ చేస్తామన్నారు. ప్రజలు మాయమాటలతో నమ్మి తెరాసకు ఓటువేసి మోసపోవద్దన్నారు. రెండు విడతలు రవీంద్రకుమార్‌, ఒక విడత నేనావత్‌ బాలునాయక్‌ గెలిచిన దాసరి నెమలిపూర్‌తండా బీటీరోడ్డుకు నోచుకోలేదని ,కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే బీటీరోడ్డు నిర్మిస్తామని హావిూనిచ్చారు. రాష్ట్రంలో ప్రజాకుటమిదే ప్రభంజనమని బాలునాయక్‌ అన్నారు. సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రమిచ్చారన్నా విషయం మరచిపోకుండా చెయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు తుంగతుర్తి నియోజక వర్గంలో అద్దంకి దయాకర్‌ను గెలిపించాలని తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకుల కు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి సూచించారు. కాంగ్రెస్‌ పార్టీలో అందరూ సమానమేనని, అధిష్ఠానానిదే తుది నిర్ణయమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. ఏఐసీసీ సభ్యుల ఆదేశాలు, దామోదర్‌రెడ్డి పిలుపుమేరకు తుంగతుర్తి కాంగ్రెస్‌ పార్టీ రెబల్‌ అభ్యర్థిగా వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు గుడిపాటి నర్సయ్య తెలిపారు. మొత్తంగా ప్రచారంలో పోటపోటీ పెరిగింది.