-->

ఎంఐఎంతో రవీందర్ సింగ్ చర్చలు

 

కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :

నగరంలోని ఎంఐఎం పార్టీ కార్యాలయం దారుస్సలాంను కరీంనగర్ నగర మాజీ మేయర్, 51వ డివిజన్ కార్పొరేటర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆదివారం సందర్శించారు. ఈసందర్భంగా ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, సర్దార్ రవీందర్ సింగ్ కు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం 2023 ఎన్నికల అంశం తో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు జరిపారు. ఈసందర్భంగా రవీందర్ సింగ్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పటికీ కెసిఆర్ అభిమానినని, కేసీఆర్ ఉన్నంతవరకు నేను బిజెపి కాదు కదా ఏ పార్టీలోనూ చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తాను ఆర్ఎస్ఎస్ భావజాలానికి, బిజెపి పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకమన్నారు. నేను నగర మేయర్ గా ఉన్న సమయంలో కరీంనగర్ ను అందమైన నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ల సహకారంతో స్మార్ట్ సిటీని తీసుకొచ్చి, నగర రూపురేఖలు మార్చే విధంగా నాడు శ్రమించానన్నారు. నాటికష్టానికి తగ్గ ఫలితమే నేటి స్మార్ట్ సిటీ అన్నారు.
స్మార్ట్ సిటీ పనుల్లో కరీంనగర్ పాత నగరానికి సంబంధించి విస్తృతంగా క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు జరగాల్సి ఉండగా, నిబంధనలను తుంగలో తొక్కి పాత నగరాన్ని కాదని నూతనంగా కార్పొరేషన్ లో విలీనమైనటువంటి గ్రామ పంచాయతీలకు స్మార్ట్ సిటీ నిధులను మళ్లించి, అభివృద్ధి పనులు చేపట్టడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇది స్మార్ట్ సిటీ నిబంధనలకు వ్యతిరేకమన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇష్టానుసారంగా స్మార్ట్ సిటీ నిధులు ఖర్చు చేయడం సమంజసం కాదన్నారు. నా జీవిత లక్ష్యం ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ అవడమేనన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాజా పరిణామాలు విపరీతంగా బాధించాయని, ఎంఐఎం పార్టీ బహిరంగంగా మద్దతు తెలిపితే బాగుండేదని, కానీ కొన్ని శక్తులు కుట్రలతో అడ్డుకున్నాయని, ఒకవేళ క్యాంపు రాజకీయాలు గనుక జరుగకుంటే, నాగెలుపు నల్లేరుపై నడకలా సాగిపోయేదని, అయినప్పటికీ నైతికంగా తానే విజయం సాధించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో నాలుగో డివిజన్ కో కార్పొరేటర్ అలీబాబా, ఎంఐఎం జాయింట్ సెక్రెటరీ సయ్యద్ మొహిజుద్దీన్ ఖాదిరి యూసుఫ్, హబీబ్ ఖాదిరి, సలావుద్దీన్, మూఫీజ్ తదితరులున్నారు.