ఎండల నుంచి రక్షణ పొందాలి
ఏడుపాయల భక్తులకు సూచన
మెదక్,మే3(జనంసాక్షి): ఏడుపాయలకు వచ్చే భక్తులు ఎండల నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలని
అధికారులు సూచించారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున పర్యాటకులు గొడులను,టోపీలను ధరించాలని, మంచినీటిని వెంట ఉంచుకోవాలన్నారు. పాఠశాలలకు వేసవి సెలవులు రావడంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, పర్యాటక కేంద్రమైన ఏడుపాయలకు భక్తుల తాకిడి గణనీయంగా పెరిగింది. ఎండను లెక్కచేయకుండా వేలాది మంది అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. దీంతో విశాలమైన ఆలయ ప్రాంగణంలో ఎక్కడ చూసినా వాహనాల సందడి, భక్తజన సందోహం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం ప్రధాన ఆలయం ముందున్న వంతెనపై షామియానాలు ఏర్పాటుచేయడంతో భక్తులకు ఉపశమనం లభిస్తోంది. సాధారణంగా ఆదివారాలు, ఇతర సెలవుదినాల్లో మాత్రమే సందడిగా ఉండేది. బడులకు వేసవి సెలవులు రావడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు జిల్లాలు, జంట నగరాలకు చెందిన అనేక మంది కుటుంబ సమేతంగా ఇక్కడికి తరలివస్తున్నారు. అలాగే ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో చాలా మంది వివాహానంతర విందులను ఇక్కడే ఏర్పాటు చేస్తున్నారు. దీంతో సాధారణ రోజుల్లో సైతం ఇక్కడ రద్దీ నెలకొంటోంది. దాహం తీర్చేందుకు ఆలయం ముందు భాగంలో చల్లని నీరందించేందుకు వీలుగా రెండు ఫ్రిజ్‌లను ఏర్పాటు చేశారు. దీనికితోడు అధికారులు కూడా తగు సూచనలు చేస్తున్నారు.