ఎంబీఏ విద్యార్థి నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో 11 మంది పోలీసుల లొంగుబాటు
న్యూఢిల్లీ : డెహరాడూన్‌లో మూడేళ్ల కిందట ఎంబీఏ విద్యార్థి రణవీర్‌సింగ్ బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో నిందితులైన 11 మంది పోలీసులు మంగళవారం ఢిల్లీ కోర్టులో లొంగిపోయారు. ప్రత్యేక సీబీఐ న్యాయవాది వీకే మహేశ్వరి సమక్షంలో వారు లొంగిపోయారు. వారిపై ఈ ఏడాది మే నెలలో నాన్‌బెయిలేబుల్ వారంట్లు జారీ అయ్యాయి. వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఈ కేసులో మొత్తం 18 మందిపై సీబీఐ అధికారులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఇతర నిందితులు ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఇన్‌స్పెక్టర్ సంతోష్ జైస్వాల్, సబ్ ఇన్‌స్పెక్టర్లు గోపాల్ దత్ భట్, రాజేశ్ బిష్ట్, నీరజ్‌కుమార్, నితిన్ చౌహాన్, చంద్రమోహన్, కానిస్టేబుళ్లు అజిత్ సింగ్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. పరారీలో ఉన్న ఇతర కానిస్టేబుళ్లు మంగళవారం లొంగిపోయారు..