ఎంసెట్‌కు ఏర్పాట్లు పూర్తి

1

హైదరాబాద్‌,మే7(జనంసాక్షి):

ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తరవాత తొలి ఎంసెట్‌కు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంజినీరింగ్‌, మెడికల్‌, అగ్రికల్చర్‌ కాలేజీలలో ప్రవేశాల కోసం ఈ నెల 14న నిర్వహించనున్న ఎంసెట్‌-2015కు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 14న జరగనున్న ఎంసెట్‌లో భాగంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంజినీరింగ్‌ పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు మెడికల్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 16న ఎంసెట్‌ కీ విడుదల చేయనున్నారు. 24న ఫలితాలు విడుదల చేస్తారు. హైటెక్‌ కాపీయింగ్‌ను అడ్డుకొనేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మెడికల్‌ విభాగంలో భారీఎత్తున మాల్‌ప్రాక్టీస్‌ జరిగే అవకాశాలున్నాయని గుర్తించారు. ఆ మేరకు భారీస్థాయిలో స్థానికంగా పోలీసుల సహకారం తీసుకోవాలని, అవసరమైనచోట బాంబు స్కాడ్‌లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందని గుర్తించారు. పరీక్ష హాలులోకి చేతి గడియారాలను కూడా అనుమతించవద్దని కోఆర్డినేటర్లకు ఎంసెట్‌ కన్వీనర్‌ రమణారావు సూచించారు. పరీక్షా కేంద్రాల్లో గోడ గడియారాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఈసారి ఎంసెట్‌ పరీక్ష కోసం 2,31,678 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 1,39,379 మంది, మెడికల్‌ విభాగంలో 92,299 మంది ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకొన్నారు. పరీక్షల నిర్వహణ కోసం 423 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో ఇంజినీరింగ్‌ కోసం 251 పరీక్ష కేంద్రాలు, అగ్రికల్చర్‌, మెడిసిన్‌ కోసం 172 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కన్వీనర్‌ పేర్కొన్నారు. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని రీజినల్‌ కో ఆర్డినేటర్లకు సూచించారు. గతంలో లాగానే ఇప్పుడు కూడా పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేదిలేదని ఎంసెట్‌ కన్వీనర్‌ తెలిపారు. పదిహేను నిమిషాల ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే విద్యార్థుల తనిఖీ కోసం పోలీసులను ఏర్పాటు చేయనున్నారు. ఈసారి ఏపీ నుంచి ఓపెన్‌ కోటాలో అధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరవుతున్నారు. మెడికల్‌ సీట్లతోపాటు పేరున్న ఇంజినీరింగ్‌ కాలేజీలలో ఓపెన్‌ కోటాలో 15 శాతం సీట్లను వారికి కేటాయిస్తారు. ఓపెన్‌ కోటా కోసం ఏపీ నుంచి దాదాపు 50 వేల మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవడంతో మెడికల్‌ విభాగానికి డిమాండ్‌ బాగా పెరిగింది. దీంతోపాటు మాల్‌ ప్రాక్టీస్‌ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని, హైటెక్‌ కాపీయింగ్‌కు ఆస్కారం ఉందని, వీటిని అరికట్టేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని అన్నారు.