ఎంసెట్‌ -2 రెండు సెట్లు లీకయ్యాయి

5

– నిర్దారించిన సీఐడీ

– ప్రభుత్వానికి నివేదిక

హైదరాబాద్‌,జులై 28(జనంసాక్షి): ఎంసెట్‌-2లో రెండు సెట్ల ప్రశ్నాపత్రాలు లీకైనట్లు సిఐడి ప్రకటించింది. వివిధ కోణాల్లో విచారణ జరిపిన సిఐడి ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్న ఎంసెట్‌-2 లీక్‌ వ్యవహారంపై సీఐడీ అధికారిక ప్రకటన చేసింది. ఎంసెట్‌-2లో రెండు సెట్ల ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని నిర్ధారించింది. ప్రశ్నాపత్రం లీకేజీకి కారణమైన రాజగోపాలరెడ్డి విద్యార్థులకు ప్రశ్నాపత్రాలు సమకూర్చినట్లు వెల్లడించింది. పరీక్షకు రెండు, మూడు రోజుల ముందు విద్యార్థులకు ప్రశ్నాపత్రాలు ఇచ్చారని నిర్ధారించింది. ప్రశ్నాపత్రాలపై శిక్షణ ఇచ్చేందుకు సుమారు ఐదు నగరాల్లో విద్యార్థులకు శిబిరాలు ఏర్పాటు చేశారని తెలిపింది. శిక్షణలో 320 ప్రశ్నలు, వాటికి సమాధానాలను విద్యార్థులకు రాసిచ్చినట్లు చెప్పింది. ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి హైదరాబాద్‌, ఏపీ, బెంగళూరులో కొందరు బ్రోకర్లను గుర్తించామని పేర్కొంది. ఇప్పటి వరకు విష్ణుధర్‌ అలియాస్‌ విష్ణువర్ధన్‌, తిరుమల్‌ అలియాస్‌ తిరుమలరావును అరెస్టు చేసినట్లు ప్రకటించింది. వీరిద్దరూ కలిసి 25 మంది విద్యార్థులను బెంగళూరు తీసుకెళ్లారని తెలిపింది. నిందితులను  నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్‌, ఏపీ, బెంగళూరులో కొంతమంది బ్రోకర్లు, సబ్‌ బ్రోకర్లను గుర్తించామని పేర్కొంది. ఎంసెట్‌-2పై ఏ సమయంలోనైనా ప్రభుత్వ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సీఐడీ నివేదిక అందిన నేపధ్యంలో ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఎంసెట్‌-2ను రద్దు చేయొద్దని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ప్రశ్నాపత్రం లీకేజీకి కారణమైన వ్యక్తులు, ఎగ్జామ్‌ లో లబ్ధి పొందిన విద్యార్థులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తెలంగాణ ఎంసెట్‌-2 ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల వ్యవహారంలో ముగ్గురిని సీఐడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. అయితే ఈ లీకేజీలో మొత్తం 30 మంది విద్యార్థులకు పేపర్‌ లీక్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 25న కేసు దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ అధికారులు రెండు సెట్ల పేపర్లు లీక్‌ అయినట్టు నిర్ధారించారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ. 30 నుంచి రూ. 40 లక్షల చొప్పున వసూలు చేసినట్టు సీఐడీ పేర్కొంది. ఢిల్లీలో ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి పేపర్‌ లీక్‌ అయినట్టు వెల్లడించింది. ముంబై, బెంగళూరులో విద్యార్థులకు పేపర్‌ ఇచ్చినట్టు తెలిపింది. రెండు రోజుల ముందు పేపర్‌ను స్టూడెంట్స్‌కు ఇచ్చారని తెలిపింది. పేపర్‌ కొన్న విద్యార్థులు బెంగళూరు, ముంబైల్లో ప్రాక్టీస్‌ చేసినట్టు సీఐడీ వెల్లడించింది. రెండు సెట్లలోని మొత్తం 320 ప్రశ్నలపై ప్రాక్టీస్‌ చేయించారు. ప్రాక్టీస్‌ ముగియగానే తిరిగి విద్యార్థులను వెనక్కి పంపినట్టు సీఐడీ తెలిపింది. రాజగోపాల్‌ రెడ్డి విద్యార్థుల చేత ప్రాక్టీస్‌ చేయించినట్టు పేర్కొంది. ఈ లీకేజీ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని సీఐడీ భావిస్తోంది. తద్వారా లీకేజీ వ్యవహారంలో అనుమానితులను కస్టడీలోకి తీసుకుని లోతుగా దర్యాప్తు చేయనుంది. ఇప్పటివరకు లభించిన ఆధారాల మేరకు ఎంసెట్‌-1లో వేలకుపైగా ర్యాంకు వచ్చి, ఎంసెట్‌-2లో మెరుగైన ర్యాంకులు సాధించిన వారు 24 మంది ఉన్నట్లు సీఐడీ పోలీసులు గుర్తించారు. బ్రోకర్‌గా చెలామణీ అవుతున్న వెంకట్రావు సెల్‌ఫోన్‌ నుంచి వీరిలో కొందరికి కాల్స్‌ వెళ్లినట్లు గుర్తించారు. సీఐడీ ప్రాథమిక విచారణను మూడు అంశాలుగా విభజించి దర్యాప్తు చేస్తోంది. పేపర్‌ తయారీ-ప్రింటింగ్‌, కోచింగ్‌ సెంటర్లు-పరీక్షకు హాజరైన విధానం, సెల్‌ఫోన్‌ కాల్స్‌-ఎంసెట్‌ ర్యాంకులుగా విభజించి విచారణ చేస్తున్నారు. కాగా, మరోవైపు డీజీపీ, సీఐడీ చీఫ్‌తో ఎంసెట్‌ కన్వీనర్‌ రమణారావు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎంసెట్‌-2 లీకేజీ వ్యవహారంపై వారు చర్చిస్తున్నట్టు సమాచారం.