ఎక్కువసేపు టీవీ ముందు కూర్చుంటే..పిల్లల్లో డయాబిటీస్‌

న్యూఢిల్లీ,జూన్‌9(జనం సాక్షి ): ఉద్యోగాలతో భార్యాభర్తలు బిజీగా గడుతుతున్న సందర్భంలో తమ పిల్లల తీరుపై వారు సరిగా దృష్టి పెట్టడం లేదు. వారికి చిరుతిల్లు ముందర పడేసి తమ వ్యవహారాల్లో ఉండిపోతున్నారు. ఇకపోతే కొందరైతే పిల్లలకు రిమోట్‌ ఇచ్చి టీవీ ముందు కూర్చోబెడుతున్నారు. రోజుకు మూడు గంటల కంటే ఎక్కువసేపు టీవీకి అతుక్కుపో తే అంతే సంగతులని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. అలాంటి తల్లిదండ్రులూ.. జాగ్రత్త పడాలి. అలా ఎక్కువసేపు పిల్లలు టీవీ ముందు కూర్చున్నా.. కంప్యూటర్‌లో వీడియోగేమ్స్‌ ఆడుతున్నావారిలో మధుమేహం సమస్యలు తలెత్తే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సమయం టీవీ చూడడం వల్ల ఇన్సులిన్‌ హార్మోన్‌ స్థాయి తగ్గి, అనియంత్రిత జీవక్రియ, రక్తంలో అధిక గ్లూకోజ్‌తో టైప్‌-2 డయాబెటిస్‌ వ్యాధి వచ్చే అవకాశం ఉందని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు అంటున్నారు. వీలైనంత వరకు పిల్లల్ని టీవీలకు, కంప్యూటర్లకు దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. వారిని ఎక్కువగా ఏదైనా యాక్టివిటీకి దగ్గరగా చేయాలని సూచిస్తున్నారు.