ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాల్సిందే

– ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉంది
– ఒక్కో కార్యకర్త ఒక్కో ఎన్టీఆర్‌లా మారాలి
– అమిత్‌షా..  ఏపీతో పెట్టుకోవద్దు
– రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లిచ్చి మొత్తం ఇచ్చామని బుకాయిస్తారా?
– యూసీలు అడిగే అర్హత అమిత్‌షాకు ఎక్కడిది..
– కేంద్రం పాలనా వ్యవహారాల్లో విూ జోక్యం ఏంటి?
– వచ్చే ఎన్నికల్లో తగిణ గుణపాఠం చెబుతాం
– మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు
– రెండవ రోజు అట్టహాసంగా ప్రారంభమైన మహానాడు
విజయవాడ,మే28(జ‌నం సాక్షి ): ఎన్టీఆర్కుఉ భారతరత్న ఇవ్వాలని మరోమారు మహానాడు వేదికగా చంద్బరాబు నాయుడు కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. సమాజానికి ఎనలేని సేవ చేసిన ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకివ్వరని కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. సమాజమే దేవాలయం.. ప్రజలే నా దేవుళ్లు అన్న ఏకైక వ్యక్తి ఎన్టీఆర్‌ మాత్రమేనని తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారం ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకుని మహానాడులో ఆయన ప్రసంగించారు. పేదరికం లేని సమాజం చూడాలని ఎన్టీఆర్‌ కలలుకన్నారని చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. సంక్రాంతికి విడుదల కానున్న ఎన్టీఆర్‌ బయోపిక్‌ ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా తెరకెక్కించాలన్నారు. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని మరోసారి తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు. అమరావతిలో ఎన్టీఆర్‌ మెమోరియల్‌ కు త్వరలోనే శ్రీకారం చుడుతున్నామని చంద్రబాబు తెలిపారు. చరిత్రలో ఎంతో మంది పుడతారని కానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేది మాత్రం కొందరేనని చంద్రబాబు అన్నారు. అలాంటి వారిలో ఎన్టీఆర్‌ అగ్రగణ్యులు అని పేర్కొన్నారు. చరిత్ర ఉన్నంత వరకు ఎన్టీఆర్‌ ప్రజలందరి మనస్సుల్లో ఉంటారని, చరిత్ర సృష్టించే యుగపురుషులు కొందరే ఉంటారని కొనియాడారు. ఎన్టీఆర్‌ జీవితం అందరికీ ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. తాను ఎన్టీఆర్‌ దగ్గర ఎన్నోవిషయాలు నేర్చుకున్నానని.. తాను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్‌ను అనురాగ దేవత షూటింగ్‌లో కలిసిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. ఎన్నో సంస్కరణలకు ఎన్టీఆర్‌ నాంది పలికారని, తెలుగు వారి ఆత్మ గౌరవానికి ఆయన ప్రతీకగా నిలిచారని కొనియాడారు. ప్రతి ఒక కార్యకర్త ఒక ఎన్టీఆర్‌ కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. పేదరికం లేని సమాజ స్థాపనకు ఎన్టీఆర్‌ బాటలో ముందుకు పోదామని పిలుపునిచ్చారు.
అమిత్‌ షా.. ఏపీతో పెట్టుకోవద్దు
అమరావతిపై భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. అమరావతిలో పనులే ప్రారంభం కాలేదని షా చెప్పడం దారుణమన్నారు. యూసీలు పంపిస్తే నిజమైనవి కావని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లు ఇచ్చి మొత్తం ఇచ్చేసినట్లు బుకాయిస్తారా? అని నిలదీశారు. అమరావతి ప్రణాళికలు ఇంకా సింగపూర్‌లోనే ఉన్నాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోలవరం, అమరావతి నిర్మాణాలకు నిధులు ఇవ్వకుండా మొండికేసి ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని
మండిపడ్డారు. ప్రత్యేక ¬దాకు, లోటు బడ్జెట్‌కు ఎలాంటి యూసీలు కావాలో అమిత్‌ షా చెప్పాలని ఎద్దేవా చేశారు. అమిత్‌ షా నిన్న చేసిన ప్రకటన పూర్తిగా అవాస్తవమైనదని చంద్రబాబు తెలిపారు. ఓ పార్టీ అధ్యక్షుడికి యూసీల విషయం ఎందుకని ప్రశ్నించారు. యూసీలు ఇచ్చామో.. లేదో ప్రధాని మోదీ చెప్పాలి గానీ.. అమిత్‌ షాకు ఎందుకని మండిపడ్డారు. పాలనా అంశాల్లో జోక్యం చేసుకోవడానికి ఆయనెవరని ప్రశ్నించారు. దేశంలోని ప్రజల సొమ్ము అంతటినీ గుజరాత్‌కు ఎలా తరలిస్తారని చంద్రబాబు నిలదీశారు. అమిత్‌ షా ఇప్పటికైనా దుర్మార్గపు ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. న్యాయం చేయాలని అడిగితే పవన్‌కల్యాణ్‌ వంటి వాళ్లతో ప్రభుత్వంపై దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో భాజపా పోటీ చేస్తే ఒక్కశాతం ఓట్లు కూడా రావని చంద్రబాబు పేర్కొన్నారు. నమ్మక ద్రోహం చేసిన వారికి గుణపాఠం చెప్పేందుకు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 175సీట్లు గెలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్రానికి రాష్ట్రాలు బానిసలు కావని ఎన్టీఆర్‌ ఆనాడే చెప్పారని ఆయన గుర్తుచేశారు. ప్రత్యేక ¬దా ఆంధ్రుల హక్కని.. దాన్నిఇవ్వకుంటే కేంద్రానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై తెదేపా కార్యకర్తలు ప్రజలను చైతన్య పరచాలని సూచించారు. ఒక రాష్ట్రంతో ఒక జాతితో అనవసరంగా పెట్టుకోవద్దని కేంద్రాన్ని, అమిత్‌ షాను చంద్రబాబు హెచ్చరించారు.