ఎన్నడూ లేనంతగా వర్షపాతం
- ఒక్కరోజులో ఏకంగా 29 సెం.మీ. వర్షపాతం
- కాలనీలన్నీ జలమయం.. పలుచోట్ల 4 అడుగుల మేర వరద
- నున్న ప్రాంతంలో ఇళ్లు, అండర్ పాస్ వద్ద 4 బస్సులు నీటమునిగిన వైనం
- శివారు కండ్రిగ వద్ద రహదారిపై భారీగా నిలిచిన వరద నీరు
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో కనీవినీ ఎరుగని వర్షం పడింది. ఒక్కరోజులో ఏకంగా 29 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఈ స్థాయిలో వర్షం కురవడం గడిచిన 30 ఏళ్లలో ఎన్నడూ లేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రెండు రోజుల పాటు కుండపోత వాన కురవడంతో సిటీలోని పలు కాలనీలు జలమయంగా మారాయి. మరికొన్ని చోట్ల ఏకంగా వీధుల్లో నాలుగు అడుగుల మేర వరద చేరింది.
శివార్లలోని కండ్రిగ వద్ద రహదారిపై భారీగా నీరు నిలవడంతో విజయవాడ-నూజివీడు మధ్య రాకపోకలకు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. నున్న ప్రాంతంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది ఇళ్లు నీటమునిగాయి. రైల్వేట్రాక్ అండర్ పాస్ వద్ద 4 బస్సులు నీట మునగగా క్రేన్ల సాయంతో అధికారులు వాటిని బయటకు తీశారు.