ఎన్నారైల సంక్షేమానికి మైరుగైన పాలసీ

2

– మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,జులై 27(జనంసాక్షి):ఎన్నారైల సంక్షేమానికి టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అందులో భాగంగానే ఎన్నారై పాలసీ విధివిధానాలు రూపొందించామని వెల్లడించారు. బేగంపేట హరితప్లాజాలో ఎన్నారైలతో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఎన్నారై పాలసీ విధివిధానాలు రూపొందించడంపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… విదేశాలకు వెళ్లే 10శాతం మంది అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. సెంటర్‌ ఫర్‌ నాన్‌ తెలంగాణ అఫైర్స్‌ కమిటీ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. జిల్లాల్లోని కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. 24 గంటలు పనిచేసే హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. విదేశాలకు ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం వెళ్లే వారికి అక్కడి చట్టాలపై పూర్తి అవగాహన కల్పిస్తామని తెలిపారు. విదేశాల్లో బ్లాక్‌ లిస్టులో ఉన్న కాలేజీల వివరాలన్నీ అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఇక నుంచి విదేశాలకు వెళ్లే వారికి వన్‌టైం రిజిస్ట్రేషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. విదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడి వెనక్కి వచ్చిన వారి కోసం కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేశామని వెల్లడించారు. విదేశాలకు వెళ్లి దురదృష్టవశాత్తూ మృతి చెందిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని పేర్కొన్నారు.