ఎన్నికలు ఎప్పుడైనా విజయం టిఆర్‌ఎస్‌దే: తలసాని

జనగామ,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు మాత్రం టీఆర్‌ఎస్‌దే అని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తేల్చిచెప్పారు. తమ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. జనగామ మండలం పెంబర్తిలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్దిదారులకు బర్రెలను పంపిణీ చేశారు. కంబాలకుంట చెరువులో చేప పిల్లలను మంత్రి తలసాని, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కలిసి వదిలారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి తలసాని మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీలకు ఒక్క సీటు కూడా రాదని స్పష్టం చేశారు. రాహుల్‌ గాంధీ ఓ బచ్చా అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఐదు సీట్లలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవదన్నారు. తమకు ఏ ఇంజినీర్‌ అవసరం లేదన్నారు. సీఎం కేసీఆరే తమ ఇంజినీర్‌ అని తెలిపారు. ఇలాంటి సీఎంలు ఐదుగురు ఉంటే దేశం బాగుపడతదని చెప్పారు. ముందస్తు.. వెనుకస్తు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్‌ భారీ మెజార్టీతో గెలుస్తుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.