ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన కోర్టు కేసులు ముగిసిపోవు
పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి
హైదరాబాద్, జూన్ 16(జనంసాక్షి): జగన్ను నిర్దోషిగా నమ్మి ప్రజలు తీర్పునిచ్చారన్న వైఎస్ విజయ వ్యాఖ్యలను పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి ఖండించారు. ప్రజాకోర్టులో గెలిచినంత మాత్రాన కోర్టుల్లో కేసులు రద్దు చేయరన్న వాస్తవాన్ని ఆమె గుర్తిెంచాలని అన్నారు.ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన చేసిన నేరాలు ఒప్పులై పోవని ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. వైఎస్ విజయమ్మ వ్యాఖ్యానించినట్లు వైఎస్సార్సిపికి బలముందని భావిస్తే శాసనసభలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని సవాలు విసిరారు. టిడిపి, కాంగ్రెస్ కుమ్మక్కైతే కొన్ని నియోజకవర్గాల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ఎందుకు నిలబడెతామని ప్రశ్నించారు. తిరుపతిలో కాంగ్రెస్, టిడిపిల తరపున ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు పోటీ చేయడం వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావడం కల్ల అని వ్యాఖ్యానించారు. 2014లో కూడా రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తీరుతుందని తులసిరెడ్డి అన్నారు. ఈ గెలుపును బలంగా భావించరాదని కేవలం ఇది వాపు మాత్రమేనని ఆయన అన్నారు.