ఎన్నికల విధుల్లో అలసత్వం పనికిరాదు
వికారాబాద్ జిల్లా కలెక్టర్ హెచ్చరిక
పరిగి,నవంబర్6(జనంసాక్షి): ఎన్నికల విధుల నిర్వహణలో అలసత్వంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సయ్యద్ ఓమర్ జలీల్ హెచ్చరించారు. మంగళవారం పరిగిలో జరిగిన నియోజకవర్గస్థాయి ఎన్నికల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు. ఓటు వేసేందుకు కేంద్రాలకు వెళ్లే దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వృద్ధులు, దివ్యాంగులు ఓటరు వరసలో నిలబడాల్సిన అవసరం లేదని.. నేరుగా కేంద్రంలోకి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని చెప్పారు. నగదు, మద్యం పంపిణీని పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు. ఎన్నికలకు వారం రోజుల ముందుగానే ఓటర్లకు ఓటరు స్లిప్పులు అందజేస్తామని వివరించారు. కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి విశ్వనాథం , సహాయ రిటర్నింగ్ అధికారి అబిద్ అలీ, వివిధ మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్‌లు, పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు.