ఎన్నికల వేళ.. ఎట్టకేలకు..
పసుపుబోర్డు, ట్రైబల్ వర్సిటీకి ప్రధాని మోడీ ప్రకటన
సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీగా ఏర్పాటు చేస్తాం
పసుపు రైతుల సంక్షేమానికి మేం కట్టుబడి ఉన్నాం..
మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ మధ్య ప్రాజెక్టులతో అనుసంధానం
మహబూబ్‌నగర్ పర్యటనలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు
మహబూబ్‌నగర్ బ్యూరో (జనంసాక్షి):తెలంగాణ ప్రజల నుంచి పలు అంశాల్లో విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఎన్నికల వేళ దిగొచ్చింది. తిరిగి ప్రజల్లోకి వెళ్లేందుకు, పసుపు రైతుల ఆగ్రహావేశాలను చల్లార్చేందుకు ఓ ప్రకటన చేసింది. మహబూబ్‌నగర్ పర్యటనలో భాగంగా తెలంగాణకు పసుపు బోర్డు, ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. పసుపు రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, బోర్డు ఏర్పాటుతో రాష్ట్ర రైతులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. రూ.900 కోట్లతో ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ పేరుతో ఏర్పాటు చేస్తామన్నారు. మహబూబ్‌నగర్‌లో జాతీయ రహదారులు, రైల్వే తదితర అభివృద్ధి పనులకు వర్చువల్ పద్ధతిలో ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. దేశంలో పండగల సీజన్ మొదలైందని, ఈ తరుణంలో తెలంగాణలో 13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. దేశంలో నిర్మించే ఐదు టెక్స్‌టైల్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించామని గుర్తుచేశారు. హన్మకొండలో నిర్మించే టెక్స్‌టైల్ పార్కుతో వరంగల్, ఖమ్మం ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టుల వల్ల మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ మధ్య అనుసంధానం కూడా పెరుగుతుందని వెల్లడిరచారు.
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు : మోడీ
వచ్చే ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కచ్చితంగా వారు కోరుకునే ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రధాని మోడీ అన్నారు. పాలమూరు ప్రజాగర్జన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. వేల కోట్ల రూపాయలతో ప్రారంభించిన ఈరోజు తెలంగాణకు శుభదినమని అన్నారు. తెలంగాణ ప్రజలు ఎల్లవేళలా బీజేపీకి అండగా నిలుస్తున్నారని, లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బలపరిచారని అన్నారు. ఈ ఉత్సాహం చూస్తుంటే తెలంగాణ సమాజం మార్పు కోరుతోందని స్పష్టంగా తెలుస్తోందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని నడిపే కారు స్టీరింగ్ ఎవరి చేతుల్లో ఉందో ప్రజలకు తెలుసని, అవినీతి, కమీషన్లకు పేరుగాంచిన ఆ రెండు కుటుంబాలు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని విమర్శించారు. ప్రైవేటు లిమిటెడ్ కంపెనీల మాదిరిగా ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని విమర్శించారు. ఆ కంపెనీలో డైరెక్టర్, మేనేజర్, సెక్రటరీ అన్ని పదవులు ఆ కుటుంబ సభ్యులవేనని ఎద్దేవా చేశారు. బీజేపీపై ప్రజల ప్రేమచూసి కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు నిద్రపట్టదన్నారు.
రుణమాఫీ చేయకుండా మోసం..
తెలంగాణ రైతులను రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేస్తోందని, రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల అనంతరం వారిని విస్మరించారని మోడీ అన్నారు. పీఎం కిసాన్ ద్వారా తాము నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని, రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరించి ఎరువుల కొరత తీర్చామని వెల్లడిరచారు. ధాన్యం కొనుగోళ్లకూ రూ.27వేల కోట్లను కేంద్రం ఇస్తోందన్నారు. ఎలాంటి గ్యారంటీ లేకుండా ముద్ర బ్యాంకు ద్వారా వీధి వ్యాపారులకు సైతం రుణాలిస్తున్నామని తెలిపారు.
ప్రధానమంత్రిని సీఎం కలవరా? : కిషన్‌రెడ్డి
ప్రధానమంత్రి మోడీ తెలంగాణకు ఎప్పుడొచ్చినా సీఎం కేసీఆర్ కలవడం లేదని, పైగా తెలంగాణ ఏమీ ఇవ్వడం లేదని విమర్శలు చేస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఎరువులపై సబ్సిడీ రూపంలో వేల కోట్లు కేంద్రం ఇస్తోందన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు వల్ల హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని, దీనిచుట్టూ రైల్వే లైన్ కూడా నిర్మించాలని కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. అందుకు రూ.26వేల కోట్లు కేటాయించిందన్నారు. రైతులు పసుపుబోర్డు కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నారని, దశాబ్దాల నాటి కలను మోడీ సాకారం చేశారన్నారు.