మంత్రి సురేఖపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

` నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ అబద్దం:కొండా సురేఖ
హైదరాబాద్‌(జనంసాక్షి): రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. తనపై మంత్రి సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పరువునష్టం కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో నాంపల్లి కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5కి వాయిదా వేసింది.
నాన్‌ బెయిలబుల్‌ వారంటే అబద్దం:సురేఖ
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పరువు నష్టం దావా కేసులో నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయినట్లు తనపై జరుగుతున్న ప్రచారంపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు. కొన్ని పత్రికలు, ఛానళ్లు, వెబ్‌ సైట్లలో తనకు కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయన్నారు. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం అని ఆమె గురువారం హదరాబాద్‌లో స్పష్టం చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ.. ఫిబ్రవరి 5వ తేదీన ఉందన్నారు. ఆ రోజు జరిగే విచారణకు హాజరుకావాలని కోర్టు తనకు స్పష్టం చేసిందన్నారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు.