నాణేలు, వారసత్వ అధ్యయనాల్లో తెలంగాణ అగ్రభాగంలో నిలవాలి

` నాణేల పరంపరకు దక్షిణ భారతం ప్రసిద్ధి
` నాణేల అధ్యయనం అంటే ఆలోచనలను అధ్యయనం చేయడమే
` న్యూ మిస్‌ మ్యాటిక్స్‌ జాతీయ సెమినార్‌ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్‌(జనంసాక్షి):న్యూ మిస్‌ మ్యాటిక్స్‌ (నాణేల అధ్యయనం), వారసత్వ అధ్యయనాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం ఆయన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగంలో ఏర్పాటుచేసిన ‘దక్షిణ భారతదేశ నాణేలు ,ఆర్థిక వ్యవస్థ’ అనే అంశంపై న్యూ మిస్‌ మ్యాటిక్స్‌ సొసైటీ ఏర్పాటు చేసిన జాతీయ సెమినార్‌ లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సదస్సు రెండు రోజులు జరిగే కార్యక్రమంగా మాత్రమే కాకుండా, ఒక చిచ్చరపిడుగులా కొత్త ఆలోచనలను రగిలించే వేదిక కావాలని నా ఆశ అన్నారు. వివిధ సంస్థల మధ్య సహకారం పెరగాలి, యువ పరిశోధకులు అంతరశాస్త్రీయ అధ్యయనాలపై దృష్టి పెట్టాలి, న్యూ మిస్‌ మ్యాటిక్స్‌, వారసత్వ అధ్యయనాల్లో తెలంగాణ ముందంజలో నిలవాలి అని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు.వారసత్వ ఆధారిత పరిశోధనకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. పర్యాటక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నాయకత్వంలో మన రాష్ట్రాన్ని శాస్త్రీయ అధ్యయనం, సంస్కృతి సంరక్షణ, జ్ఞాన ఉత్పత్తిలో కేంద్రీకృత హబ్‌గా తీర్చిదిద్దడంలో రాష్ట్ర ప్రభుత్వం దృఢసంకల్పంతో ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు.దక్షిణ భారతదేశానికి ప్రపంచంలోనే అత్యంత సమృద్ధిగా నాణేల పరంపర ఉంది అని డిప్యూటీ సీఎం తెలిపారు. శా తవాహనులు, ఇక్ష్వాకులు తమ వాణిజ్య నెట్‌వర్క్‌లను నాణేల ద్వారా విస్తరించగా, కాకతీయుల నుండి విజయనగర సామ్రాజ్యపు వైభవం వరకు మన ప్రాంతపు నాణేలు ఆవిష్కరణ, కళాత్మకత, నైపుణ్యమైన రాజ్యపాలనకు ప్రతీకగా నిలిచాయి అని డిప్యూటీ సీఎం వివరించారు. ఈ నాణేలు మనతో మాట్లాడతాయి, కొన్నిసార్లు బిగ్గరగా ఆ కాలపు పన్ను వ్యవస్థలు, ముద్రణ, సాంకేతికత, వాణిజ్య ప్రాధాన్యతలు, రాజకీయ దృక్పథం గురించి ఎన్నో విషయాలను వివరిస్తాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.ఈ సదస్సు స్వతహాగానే చారిత్రాత్మకమైనది. వారసత్వ శాఖ ఇంతకు ముందు పురావస్తు మ్యూజియంల శాఖ114 ఏళ్ల ప్రయాణంలో తొలిసారిగా నాణేలపై మాత్రమే సర్వాంగ సుందరమైన జాతీయ సదస్సును నిర్వహించడం అభినందనీయం అన్నారు. సామ్రాజ్యాలు ఉదయించడం మరియు ఆస్తమించడం చూసిన ఈ శాఖకు ఇది నిజంగా ఒక అద్భుతమైన మైలురాయి అని డిప్యూటీ సీఎం అన్నారు. ఈ సదస్సు తెలంగాణకే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలకూ గర్వకారణం అన్నారు.న్యూ మిస్‌ మ్యాటిక్స్‌ అంటే చేతిలో పట్టుకునే చిన్న చిన్న లోహపు ముద్రల అధ్యయనం మాత్రమే అనిపించవచ్చు. కానీ ఒక నాణెం పైకి చూస్తే అది ఒక చిన్న ప్రపంచమే కనిపిస్తుంది అన్నారు. నాణేలు మన పురాతన ‘‘కంప్రెస్డ్‌ డేటా’’ లాంటివి అని తాను తరచూ భావిస్తుంటానని తెలిపారు. కొద్ది గ్రాముల లోహంలో ఆ కాలం ఆర్థిక వ్యవస్థ, రాజు ఆశయాలు, సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్య మార్గాలు, ధార్మిక చిహ్నాలు, దౌత్య సంబంధాలు అన్నీ అందులో నిక్షిప్తం అయి ఉంటాయి అన్నారు. పురావస్తు శాస్త్రవేత్తలు ఫైల్‌ను కనుక్కుంటే దానికి ‘కాయిన్‌’ అన్న పేరు పెట్టేవారేమో అనిపిస్తుంది అని డిప్యూటీ సీఎం అన్నారు. ఓఈ రోజుల్లో భారత్‌ డిజిటల్‌ చెల్లింపుల్లో, ఫింటెక్‌ ఆవిష్కరణల్లో ప్రపంచాన్ని నడిపిస్తున్న సమయంలో పద్ధెనిమిది పైసల కన్నా కోడ్‌లు ఎక్కువగా కనిపిస్తున్న సమయంలో మన ఆర్థిక ప్రయాణం ఎంత దూరం వచ్చిందో ఈ సందర్భం మనకు గుర్తుచేస్తుందనీ తెలిపారు. వారసత్వం అంటే కేవలం వెనక్కి చూసుకోవడం కాదు నేటికీ ప్రభావం చూపుతున్న ఆలోచనల ఒక పెద్ద వలయం అర్థం చేసుకోవడమే అని తెలిపారు. నాణేలను అధ్యయనం చేయడం అంటే లోహాన్ని కాదు, ఆలోచనను అధ్యయనం చేయడం అని డిప్యూటీ సీఎం అభివర్ణించారు. తెలంగాణ నుండి ఒకే ఒక నాణెం మనకు ఎంత చరిత్ర చెబుతుందో తెలుసుకోవచ్చు అన్నారు. కోటి లింగలలో పురావస్తు శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన శా తవాహన సీసపు నాణాన్ని కనుగొన్నారు చూడడానికి అది సాదాసీదాగా కనిపించేది కానీ లోతుగా చూస్తే అసాధారణమైనది అన్నారు. ఒక వైపు ఉజ్జయినీ చిహ్నం, నాలుగు చిన్న వృత్తాలు క్రాస్‌ ఆకారంలో, విశ్వ నియమం, నిరంతరతను సూచించే పురాతన భారత వాణిజ్య నెట్‌వర్క్‌లలో విస్తృతంగా ఉపయోగించిన చిహ్నం వంటివి ఉన్నాయి అన్నారు. మరో వైపు సరస్సు తీరానికి గోడలాగా లేదా స్తూప శైలి రైలింగ్‌ ఆకృతి దక్షిణ భారత బౌద్ధ కళలో కనిపించే ముద్ర అని వివరించారు. ఈ రెండు చిహ్నాల మధ్య ఒక బ్రాహ్మీ లిపి, ఒక శా తవాహన పాలకుడి పేరును సూచిస్తుంది.నేటి తెలంగాణ ప్రాంతంలో వారి ఉనికికి ఉన్న తొలితరపు ఆధారాలలో ఇదొకటి అని డిప్యూటీ సీఎం వివరించారు.
ఇలాంటి చిన్న నాణెం మనకు ఏమి చెబుతుంది అంటే? మొదట, తెలంగాణ పరధ్యాన ప్రాంతం కాదు, డెక్కన్‌ వాణిజ్య వ్యవస్థలో కీలక కేంద్రం అనే విషయాన్ని స్పష్టం చేస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు. రెండవది రాజకీయ అధికారం, బౌద్ధం, వాణిజ్యం ఇవన్నీ ఎంతగా పరస్పరం అనుసంధానమై ఉన్నాయో చూపుతుంది అని వివరించారు. మూడవది ఈ నాణెం సీసంతో తయారు కావడం డెక్కన్‌లో లభ్యమయ్యే లోహం మన పూర్వీకులు స్థానిక వనరుల ఆధారంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలను ఎంతో నైపుణ్యంగా నిర్మించారనేదనిర్మించారనేది సూచిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ ఒక్క నాణెంలోనే రాజకీయాలు, ఆధ్యాత్మికత, లోహశాస్త్రం, కళ, ఆర్థిక వ్యవస్థ వంటి అన్ని అంశాలు ఒకేచోట కలిసిపోయాయి అని వివరించారు. ఆధునిక చరిత్రకారుడు ఈ చిన్న లోహపు ముక్క చెప్పే విషయం చెప్పడానికి పేజీల తరబడి రాయాల్సి ఉంటుంది అన్నారు.అందుకే ఇక్కడున్న పరిశోధకులు, విద్యార్థులందరికీ నా హృదయపూర్వక అభినందనలు ఆర్థిక శాస్త్రం, సంస్కృతి, లోహశాస్త్రం, చరిత్ర అన్ని కలిసే ఈ అద్భుత రంగాన్ని ఎంచుకున్నందుకు సబికులందరికీ అభినందనలు తెలిపారు. సదస్సులో పాల్గొనే వారందరి మధ్య ఫలప్రదమైన చర్చలు, కొత్త స్నేహాలు, కొత్త అన్వేషణలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని డిప్యూటీ సీఎం తెలిపారు. మన శాస్త్రానికి, మన పూర్వీకుల చరిత్రను అర్థం చేసుకోవడానికి ఈ సదస్సులు మరింత విలువ తీసుకురావాలి అని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు. సమావేశంలో తెలంగాణ హెరిటేజ్‌ డైరెక్టర్‌ అర్జునరావు, న్యూ మిస్‌ మ్యాటిక్‌ ఇండియా సొసైటీ చైర్మన్‌ డాక్టర్‌ డి. రాజారెడ్డి, న్యూ మిస్‌ మ్యాటిక్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా జనరల్‌ సెక్రెటరీలు ప్రొఫెసర్‌ పి.ఎన్‌. సింగ్‌, ప్రొఫెసర్‌ బింద దత్తాత్రేయ, డిప్యూటీ డైరెక్టర్‌ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.