ఎన్నికల శంఖారావంను పూరించిన సోనియా

1

వారణాసి,ఆగస్టు 2(జనంసాక్షి): ఏడాదికి ముందే యూపి ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రచార వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా అనేక చర్యలు తీసుకున్న పార్టీ మంగళవారం ప్రదాని మోడీ నియోజకవర్గం వారణాసిలో భారీ ర్యాలీలో అదరగొ/-టటింది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ  ఉత్తరప్రదేశ్‌లో ప్రచారం ప్రారంభించారు. వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారానికి ఆమె శ్రీకారం చుట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గమైన వారణాసిలోనే ఆమె ప్రచారం మొదలు పెట్టడం విశేషం. విమానాశ్రయం నుంచి సోనియా గాంధీ కాన్వాయ్‌తో పాటు వేలాది మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు జెండాలతో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. సోనియా గాంధీ పలుచోట్ల రోడ్‌షోలో పాల్గొన్నారు. మోదీ సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్‌ బలాన్ని చాటుకోవడానికే సోనియా తొలి ప్రచార కార్యక్రమానికి వారణాసిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మోదీ ప్రధానిగా నియమితులయ్యాక సోనియాగాంధీ వారణాసికి వెళ్లడం ఇదే తొలిసారి. సోనియా వెంట యూపీ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి షీలా దీక్షిత్‌, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్‌, యూపీసీసీ చీఫ్‌ రాజ్‌బబ్బర్‌, పార్టీ సీనియర్‌ నేతలు ప్రమోద్‌ తివారీ, సంజయ్‌ సింగ్‌లు ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో గత 27ఏళ్లుగా కాంగ్రెస్‌కు అధికారం దక్కలేదు. వచ్చే ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో అభివృద్ధి లోపించిందనే అంశంపైనే కాంగ్రెస్‌ ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రచారం చేయనుంది. దీంతో భారీ ర్యాలీతో తొలుత ఆకట్టుకున్నారు.