ఎన్నికల సంస్కరణలపై జాతీయ సెమినార్‌

ఉప ఎన్నికల నిర్వహణ బేష్‌
ఎన్నికల నిఘా వేదిక ప్రశంసలు
హైదరాబాద్‌, జూన్‌ 13 : ఎన్నికల నిర్వహణలో తీసుకురావాల్సిన సంస్కరణలపై త్వరలో జాతీయ స్థాయిలో ఒక సెమినార్‌ను నిర్వహిస్తామని ఎన్నికల నిఘా వేదిక రాష్ట్ర కమిటీ పేర్కొంది. జాతీయ స్థాయి సదస్సు అనంతరం రాష్ట్ర, జిల్లాస్థాయిలో కూడా సెమినార్లు నిర్వహించి ఎన్నికలలో తీసుకురావాల్సిన తక్షణ సంస్కరణలపై ప్రజలను జాగృతం చేస్తామని తెలిపింది. బుధవారంనాడు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిఘా వేదిక విలేకరుల సమావేశం నిర్వహించింది. చిన్నచిన్న సంఘటనలు మినహా 12 జిల్లాలలో పోలింగ్‌ ప్రశాంతంగా జరగడం, రిపోలింగ్‌ అవసరం లేకుండా ఎన్నికలు నిర్వహించడం హర్షనీయమని వేదిక ప్రతినిధులు పేర్కొన్నారు. ఇందుకు బాధ్యులైన ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌, డిజిపి దినేష్‌రెడ్డి, ఎన్నికల సిబ్బంది, రాజకీయ పార్టీల నేతలను, అభ్యర్థులను, ఓటర్లను వారు అభినందించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు అమ్ముకోబోమని ప్రతిజ్ఞ చేయడం ఉపపరిణామంగా భావిస్తున్నామన్నారు. ఈ పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి అన్ని పౌర సంస్థలు కృషి చేస్తాయని ఆశిస్తున్నామన్నారు.
12 జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతి ఓటర్‌కు 300 రూపాయల నుండి 1500 వరకు నగదు పంపిణీ చేసినట్లు తెలియవచ్చింది. ఇంటింటి ప్రచారానికి, ప్రదర్శనలకు, ఊరేగింపులకు, ఇతర ప్రచార కార్యక్రమాలకు 95 శాతం మంది ప్రజలు డబ్బులు, మద్యం అందుకొని పాల్గొన్నారు. నేటి ఉప ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఖర్చు పెట్టిన వ్యయం 1000 కోట్ల రూపాయలు దాటుతుందని ఎన్నికల నిఘా అంచనా వేస్తుందన్నారు. ఈ పరిస్థితి ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా మార్చిందని అన్నారు. ఎన్నికల బరిలో సామాన్యులకు స్థానం లేకుండా చేసింది. ఓటర్ల జాబితా ప్రక్షాళనకు అనేక చర్యలు చేపట్టినప్పటికి ఇంకా 10 శాతం అవకతవకలు ఓటర్ల జాబితాలో కొనసాగుతున్నాయి. ఒకే ఓటరుకు అనేక పోలింగ్‌ బూత్‌లలో ఓటు ఉండడం, వలస వెళ్లిన ఓటర్ల పేరు ఓటర్ల జాబితాలో చోటు చేసుకోవడం, ఓటర్ల పేర్లు, పోటోలలో వ్యత్యాసాలుండటం లాంటి అవకతవకలను పూర్తిగా తొలగిస్తే ఓటింగ్‌ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
1952 లోక్‌సభ ఎన్నికల్లో 50శాతం ఓటింగ్‌ జరగ్గా నేడు 80శాతం ఓటింగ్‌ జరగడం హర్షనీయం. నేటి ఎన్నికల శైలిని పరిశీలిస్తే అంగబలం తగ్గిపోయి అర్ధబలం, కులబలం పెరిగింది. రిగ్గింగ్‌కు పాల్పడడం, బూత్‌లను అక్రమించడం తగ్గిపోయి ఓటర్లకు డబ్బు, మద్యం ఆశ పెట్టడం ఎక్కువైంది. ఎన్నికల నిఘా వేదిక 12 జిల్లాల్లోని 18 శాసనసభ నియోజకవర్గాల్లో లోక్‌సభ నియోజకవర్గంలో 200 మంది ఎన్నికల నిఘా కార్యకర్తలు, 50 బృందాలుగా ఏర్పడి 500 సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా వేశారు. దీంతో ఓటింగ్‌ శాతం కొంచం పెరగడానికి దోహదపడిందన్నారు. ఉప ఎన్నికల్లో సెంటిమెంట్‌, సానుభూతి, సంక్షేమ పథకాల అమలు ప్రధాన పాత్ర పోషించాయని అన్నారు. ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు సిద్ధాంతపరంగా చర్చలు జరపకుండా వ్యక్తిగత దూషణలు, ఓటర్లను ప్రలోభపెట్టడంపై దృష్టి పెట్టి కులపరంగా చీల్చడానికి కృషి చేశారని విమర్శించారు. గత ఎన్నికలను భారత ఎన్నికల సంఘం గత 20 సంవత్సరాలుగా ఎన్నికల సంస్కరణలను కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చినా వాటిని పార్లమెంట్‌లో చర్చించకపోవడం శోచనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబటి లక్ష్మణరావు, కె. మాధవరావు, టి. తిరుపతిరావు, సి.వి.రాఘవులు, డాక్టర్‌ రావు చెలికాని, వి.లక్ష్మణరెడ్డి, కె.రమేష్‌, సునిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.