ఎన్నికల హమీలను కేసీఆర్ విస్మరించారు
– దిగ్విజయ్‌సింగ్
హైదరాబాద్,అక్టోబర్ 20(జనంసాక్షి): తెలంగాణలో అరాచకపాలన కొనసాగుతోందని తెలుగు రాష్ట్రాల వ్యవహారాల కాంగ్రెస్ ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక రైతు ఆత్మహత్యలు పెరిగాయని ఆయన ఆరోపించారు. కర్నాటక ప్రభుత్వం అమలు చేస్తున్న విధంగా రిజిష్టర్‌కాని ప్రైవేట్ ఫైనాన్షులపై కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌కు వచ్చిన దిగ్విజయ్ మంగళవారం విూడియాతో మాట్లాడుతూ తెలంగాణలో రైతుల రుణాలను ఒకే విడతలో మాఫీ చేయాలని దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు. రైతు కుటుంబాలకు పింఛన్ ఇవ్వడంతో పాటు వారి పిల్లలను ప్రభుత్వమే చదివించాలని దిగ్విజయ్ కోరారు. మంగళవారం దిగ్విజయ్ హైదరాబాద్ లో మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నిక గురించి పార్టీ నేతలతో చర్చించారు. నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి గుండెపోటుతో మరణించడంతో ఉప ఎన్నక జరగనున్న విషయం తెలిసిందే.మెదక్ జిల్లా నారాయణ ఖేడ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి విషయమై నాయకత్వం ఒక కొలిక్కి వచ్చినట్లు కనబడుతోంది.దివంగత ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డికే టిక్కెట్ ఇవ్వాలని మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలు సూచించారు.కాని మాజీ ఎమ్.పి.సురేష్ షెట్కర్ తనకు టిక్కెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దాంతో ఈ విషయాన్ని పార్టీ ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ దృష్టికి తీసుకువెళ్లారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలతో సమావేశం అయి ఆయన దీనిపై చర్చించారు. తదుపరి సురేష్ షెట్కార్ ను దిగ్విజయ్ సింగ్ బుజ్జగించడానికి యత్నించారు.ఈసారి కి ఉప ఎన్నిక ఇన్ చార్జీ బాద్యతలు చేపట్టాలని ఆయన కోరారు. తెలంగాణలో వరంగల్ జిల్లాలో అత్యధిక ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతు ఇచ్చారని,ఇప్పుడు అక్కడ నుంచే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పతనం ఆరంభం అవుతుందని అన్నారు.వరంగల్ జిల్లా ప్రజలు గతంలో ఎంత ఘనంగా టిఆర్‌ఎస్ కు పట్టం కట్టారో, అంతకన్నా ఎక్కువ అసంతృప్తిగా ఉన్నారని అన్నారు.అందువల్ల ఇక్కడ నుంచే కెసిఆర్ పతనం ఆరంభం అవుతుందని, వరంగల్ ఉప ఎన్నికలో ఆ పార్టీ ఓడిపోతుందని ఆయన అన్నారు. అటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూలను మోదీ ప్రభుత్వం నెరవేర్చడంలేదని విమర్శించారు. దేశంలో బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల ఆరాచకాలు పెరిగిపోతున్నా ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రతి చిన్న అంశానికి ట్విట్టర్‌లో సందేశాలు పంపే మోదీ రచయితలవిూద దాడులు జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాలని దిగ్విజయ్ సింగ్ డిమండ్ చేశారు. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్
కార్యకర్తలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నా మోదీ పట్టించుకోవడంలేదని దిగ్విజయ్ విమర్శించారు. సుధీంద్ర కులర్ణిపై నలుపు రంగు పులిమినా మౌనంగానే ఉన్నారని, రోజు రోజుకు దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థతో పాటు నల్లధనం లాంటి అంశాలపై సర్కార్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మోదీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన దుయ్యబట్టారు.