ఎపిలో మారిన వాతావరణం
క్ములో నింబస్ మేఘాలతో బెజవాడలో చీకట్లు
అప్రమత్తంగా ఉండాలని బాబు హెచ్చరిక
అమరావతి,జూన్2(జనం సాక్షి): రాష్ట్రంలో వాతావరణ మార్పులు, పిడుగులు పడుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. పలు జాగ్రత్తలను, హెచ్చరికలను కింది స్థాయి వరకు తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే అధికారులతో కలెక్టర్లు సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేయాలని, అందుకు అనుగుణంగా కార్యాచరణ అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. బెజవాడ పరిసరాల్లో ధగధగ మండే భానుడు ఒక్కసారిగా చల్లబడ్డాడు. పలుచోట్ల వర్షంకూడా పడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారంవరకూ తీవ్ర ఉష్ణోగ్రతలతో అల్లాడిన ప్రజలకు ఇవాళ్టి వాతావరణం కాస్త ఉపశమనం కలిగించింది. మరోవైపు క్యుములో నింబస్ మేఘాల కారణంగా నగరంలో మిట్టమధ్యాహ్నం ఒక్కసారిగా అంధకారం అలముకుంది. భారీ ఈదురుగాలుల కారణంగా నగరంలోని ప్లెక్సీలు, ¬ర్డింగ్‌లు ఊడిపడ్డాయి. విపరీతంగా దుమ్మురేగటంతో రహదారులు ఒక్కసారిగా నిర్మానుష్యమయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో మారిన వాతావరణ పరిస్థితులపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సవిూక్షించారు. పలుచోట్ల పిడుగులు పడుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు. కలెక్టర్లు క్రింది స్థాయి అధికారులతోసమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసి అందుకనుగుణంగా కార్యాచరణ అమలు చేయాలని దిశానిర్దేశర చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. చాట్రాయి, విసన్నపేట, తిరువూరు, ఎ.కొండూరు, వత్సవాయి, ఆగిరిపల్లి, విజయవాడ రూరల్ మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు నందిగామ పరిసరాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది.