ఎప్పటికీ చంద్రబాబే సీఎం
– నాలుగేళ్లు ఓపిగ్గా చూశాకే కేంద్రం నుంచి వైదొలిగాం
– బీజేపీ, వైసీపీ కుట్రలను తిప్పికొడదాం
– 2019లో అసలైన సినిమా రాబోతోంది
– ఐటీశాఖ మంత్రి నారా లోకేష్
గుంటూరు, జూన్5(జనం సాక్షి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికీ, ఎప్పటికీ చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటారని మంత్రి నారా లోకేశ్ అన్నారు. గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలో నిర్వహించిన నవనిర్మాణ దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడుతూ… బడుగుల జీవితాల్లో అంబేడ్కర్, ఎన్టీఆర్ వెలుగులు నింపారని, వారి బాటలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పయనిస్తున్నారని అన్నారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో తెదేపా గెలుపు ఖాయంగా కనిపిస్తోందన్నారు. నాలుగేళ్లు ఓపికగా చూశాకే ఎన్డీయే నుంచి తాము బయటకు వచ్చామని లోకేశ్ తెలిపారు. ప్రత్యేక ¬దా కంటే మెరుగ్గా ప్యాకేజీ ఇస్తామని, ఏ రాష్ట్రానికి ప్రత్యేక ¬దా ఇవ్వటం లేదని కేంద్రం స్పష్టం చేసిందన్నారు. అందుకే సీఎం చంద్రాబు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నాడని, తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవచ్చని భావించారన్నారు. కానీ మిగిలిన రాష్ట్రానికి ప్రత్యేక ¬దా కొనసాగించిన కేంద్రం, ఏపీకి ప్రత్యేక ¬దా ఇవ్వకుండా, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా ఏపీ ప్రజలను మోసం చేసిందని, దీనిని వ్యతిరేకించిన చంద్రబాబు కేంద్రం నుంచి వైదొలగాల్సి వచ్చిందన్నారు. ఏపీ ప్రజల ప్రయోజనాలే చంద్రబాబుకు ముఖ్యమని, వారికోసం ఎంతకైనా వెళ్లేందుకు తెదేపా సిద్ధంగా ఉందన్నారు. కేంద్రం నుంచి వైదలగగానే బీజేపీ ఏపీలో కుట్ర రాజకీయాలకు తెరలేపిందన్నారు. బీజేపీని ప్రశ్నించాల్సిన వైసీపీ, పవన్ కళ్యాణ్‌లు చంద్రబాబును తిడుతుంటే ఆశ్చర్యమేస్తుందని, ఈ విధానమే ఏపీపై వారి చిత్తశుద్దిని తెలియజేస్తుందని లోకేష్ అన్నారు. తెలుగుజాతితో పెట్టుకున్నందునే కర్ణాటకలో తెలుగు ప్రజలు భాజపాకు గుణపాఠం చెప్పారని.. ఆంధప్రదేశ్‌లోనూ ఆ పార్టీకి బుద్ధిచెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. 2019లో అసలైన సినిమా రాబోతోందని లోకేశ్ వ్యాఖ్యానించారు.