ఎఫ్‌డీఐలను ఆపలేము

ఫెమా చట్టాన్ని సవరించండి : సుప్రీం
న్యూఢిల్లీ, అక్టోబర్‌ 15 (జనంసాక్షి): రిటైల్‌ రంగంలో ఎఫ్‌డీఐలను అనుమతించాలన్న యూపీఏ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు బాసటగా నిలిచింది. ఎఫ్‌డీఐల అమలుకు వీలుగా విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టాన్ని (ఫెమా) నిబంధనలను సవరించాలని సుప్రీంకోర్టు సోమవారం నాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం రూపొందించిన ఎఫ్‌డీఐల విధానానికి చట్ట బద్ధత కల్పిస్తూ ఆర్‌బీఐ నేటి వరకు చట్టంలో ఎలాంటి సవరణలు చేయలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. రిటైల్‌ రంగంలో ఎఫ్‌డీఐలను అమలు పరిచేందుకు వీలుగా ఫెమా నిబంధనలను సవరించాలనిప్రభుత్వం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను(ఆర్‌బీఐ) ఆదేశించింది. నవంబర్‌ 3వ తేదీలోగా ఫెమా చట్టంలో అవసరమైన మార్పులు, చేర్పులను ఆర్‌బీఐ చేపట్టనున్నది. ఇదే సమయంలో రిటైల్‌ రంగంలో ఎఫ్‌డీఐల అనుమతిపై ప్రభుత్వం నిర్వహించనున్న సమావేశంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నెల 19వ తేదీన ఈ సమావేశం జరగాల్సి ఉంది. రిటైల్‌ రంగంలో ఎఫ్‌డీఐలను అనుమతిస్తూ 50 కంపెనీలకు ప్రభుత్వం లైసెన్స్‌లు మంజూరు చేసేందుకు ఈ సమావేశం జరగనున్నది. చట్ట సవరణలు లేనందునా ఎఫ్‌డీఐ విధానంపై స్టే మంజూరు చేయాల్సిందిగా కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం(పిల్‌)పై సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.