ఎర్రచందనం రక్షణకు కఠినచర్యలు

చిత్తూరు,మే26(జ‌నంసాక్షి): ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడంతో పాటు అడవులను కాపాడేందుకు కఠిననిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించి ఆ మేరకు కార్యాచరణ చేశారు. ఎర్రచందనానికి సంబంధించి అనేక కేసుల్లో అటవీ, పోలీసుశాఖలోని కొందరి పాత్రపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఎర్రదొంగలకు సహకరిస్తున్న ఇంటిదొంగలపైనా నిఘా పెంచారు. గతానికి భిన్నంగా అటవీ పోలీస్‌ అధికారులు ఉమ్మడిగా ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అడవిదొంగలకు సహకరిస్తున్న ఇంటిదొంగల పనిపట్టారు. ఇంటిదొంగల పనిపట్టే క్రమంలో ప్రత్యేక టాసక్‌ఫోర్స్‌ పనిచేస్తోంది.కలప అక్రమ రవాణను అరికట్టేందుకు ఉమ్మడి వ్యూహంతో సాగుతున్నారు. కొందరు ఇంటిదొంగలు వ్యవస్థనే తప్పుదారి పట్టిస్తుండటం, అక్రమార్కులకు వంతపాడుతున్నట్లు వెల్లడైంది. అక్రమార్కులకు సహక రిస్తున్న పోలీస్‌ శాఖలోని ఇంటి దొంగలపై వేటేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు ప్రధాన కేంద్రంగా మారిన ప్రాంతాల్లో అందుకు సహకరిస్తున్న కూలీలు, స్మగ్లర్లను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. పోలీసు, అటవీ, టాస్క్‌ఫోర్స్‌ విభాగాల వారు తమదైన రీతిలో కసరత్తు చేస్తున్నారు. స్మగ్లర్ల నుంచి భారీ స్థాయిలో ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు రావడంతో ఆ దిశగా చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ప్రత్యేకమైన పోలీసు సిబ్బందిని నియమించి విచారణ చేపట్టారు. అక్రమార్కులకు సహకరిస్తున్న వారిని కట్టడి చేసే దిశగా గట్టి క్రమశిక్షణ చర్యలు చేపట్టారు.తప్పు చేస్తే ఎవరినీ వదలరని, ఎర్రచందనం కేసుల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.