ఎర్రవల్లిలో ఆధ్యాత్మిక శోభ

మూడోరోజు యాగంలో పాల్గొన్న కెసిఆర్‌ దంపతులు

గజ్వెల్‌,జనవరి23(జ‌నంసాక్షి): తెలంగాణ సీఎం కేసీఆర్‌ తలపెట్టిన సహస్ర మహాచండీ యాగం మూడో రోజు కొనసాగింది. ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో బుధవారం ఉదయం 8 గంటలకు యాగం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులతో పాటు ఇతర కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. మొదట రాజశ్యామల దేవీ కొలువు దీరిన మండపానికి చేరుకొని అమ్మవారికి తొలి పూజ చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య సీఎం దంపతులు అమ్మవారికి అభిషేకం చేశారు. నవగ్రహ పూజలు నిర్వహించారు. వేద పారాయణ మండపంలో ప్రార్థనలు.. సూర్య నమస్కారాలు చేశారు. సహస్ర మహాచండీ పారాయణ మండపంలో చండీమాత పూజలు నిర్వహించారు. మహారుద్ర మండపంలో రుద్ర హవనం , రుద్ర పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు పాల్గొన్నారు. నిరంతర వేదఘోషతో ఎర్రవల్లి చండీయాగ వేదిక అమరధామంలా శోభిల్లుతున్నది. గజ్వేల్‌ నియోజకవర్గంలోని ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో సమాజ క్షేమం కోసం, తెలంగాణ ప్రజల సుఖశాంతుల కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంకల్పించిన మహారుద్ర సహిత సహస్ర చండీయాగం దిగ్విజయంగా సాగింది. రుత్విక్కులు చండీ పారాయణాలు పూర్తిచేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు మంత్రపుష్ప సహిత మాధ్యాహ్నిక పూజలు నిర్వహించారు. అమ్మవారికి మహా హారతినిచ్చారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి రుత్విక్కులు మూడు లక్షల నవార్ణ జపంచేశారు.

 

తాజావార్తలు