ఎర్ర పుస్తకమా…సలాం !
“”””””””””””””””””””””””””””””””””””
ఎర్ర పుస్తకం ఆద్యంతం
కార్మిక కర్షక శ్రామికులకు
పోరు పాఠం ప్రబోధిస్తుంది
కష్టజీవులు కర్మవీరులకు
రణ తంత్రం మంత్రిస్తుంది
తాడిత పీడిత వర్గాలకు
విప్లవ దారి చూపుతుంది
మూగబోయిన గళాలకు
ధిక్కార శృతి నేర్పిస్తుంది
సామాజిక అసమానతల
దొంతరలను పూడ్చేందుకు
సాహసాన్ని నూరిపోస్తుంది
అంధకారమైన జీవితాల్లో
క్రాంతి దీప్తిలా ప్రభవిస్తుంది
భూస్వామ్య దోపిడీదార్లను
అగ్ని క్షిపణిలా వణికిస్తుంది
పెట్టుబడిదారుల గుండెల్లో
రగల్ గునపమై దిగుతుంది
మహా వీరుల జీవితగాదల
కళ్లెదుట సాక్షాత్కారం చేసి
సమ సమాజ నిర్మాణానికి
సబ్బండవర్గాల కదిలిస్తుంది
మరో మహోదయం వైపు
మానవాళిని నడిపిస్తుంది
ప్రతీ అక్షరం ఓ చైతన్యం
ప్రతీ పదం ఓ ప్రజ్వలనం
ప్రతీ పాదం ఓ ఉద్దీపనం
ప్రతీ పుట ఓ ఉత్ప్రేరణం
విముక్తి చిహ్నమా !
ఎర్ర పుస్తకమా నీకు
ఉద్యమాల వందనం
విప్లవాల అభివందనం
“”””””””””””
(రెడ్ బుక్స్ ఉత్సవాల సందర్బంగా…)
కోడిగూటి తిరుపతి