ఎల్లంపల్లి, మిడ్‌మానేరులను త్వరితగతిన పూర్తి చేయండి

5

– ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై మంత్రి హరీష్‌ సమీక్ష

హైదరాబాద్‌ నవంబర్‌28(జనంసాక్షి):

ఎల్లంపల్లి, మిడ్‌ మానేరు ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణ సమస్యలు, సహాయ పునరావాస సమస్యల పరిష్కారం కోసం ఇరిగేషన్‌ శాఖ మంత్రి హరీష్‌ రావు సవిూక్ష జరిపారు. వచ్చే జూన్‌ (ఖరీఫ్‌) నాటికి చొప్పదండి, వేములవాడ, ధర్మపురి నియోజకవర్గాలకు సాగునీరు అందించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. ఈ మూడు నియోజకవర్గాలకు లక్ష ఎకరాల చొప్పున సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు.

రూ. 230 కోట్లతో వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్‌, మేడిపల్లి మండలాల్లోని 44,000 ఎకరాలకు సాగునీరు అందించటానికి కావాల్సిన చర్యలను తీసుకోవాలని మంత్రి హరీష్‌ రావు అధికారులను ఆదేశించారు. ఇందుకోసం కావాల్సిన సవివర ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌) ను తయారు చేయాలని చెప్పారు.

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ కింద ఖరీఫ్‌ పంట కాలానికి నీరు అందించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి హరీష్‌ రావు అధికారులను ఆదేశించారు. అందుకోసం అవసరమైన చర్యలను తీసుకోవాలని మంత్రి చెప్పారు. ఎల్లంపల్లి, మిడ్‌ మానేరు ముంవు గ్రామాలలో ఇండ్లు, కట్టడాల వాల్యుయేషన్‌ ను వేగవంతం చేయాలని మంత్రి హరీష్‌ రావు చెప్పారు. ఎక్కడ కూడా పొరపాట్లకు ఆస్కారం లేకుండా ముందుకుపోవాలని స్పష్టం చేశారు.

చొప్పదండి, వేములవాడ భూసేకరణ సందర్భంగా వస్తున్న సమస్యలపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమున్న చోట జీవో 123 ప్రకారం భూసేకరణ చేయాలని చెప్పారు. చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల, కొడిమ్యాల, బోయిన్‌ పల్లి, రామడుగు, గంగాధర, చొప్పదండి మండలాల్లో జరుగుతున్న భూసేకరణ సమస్యలపై గ్రామాల వారీగా మంత్రి హరీష్‌ రావు సవిూక్షించారు. చర్లపల్లి, గుండెనపల్లి, కోనపూర్‌ గ్రామాలను ముంపు నుండి తప్పించడానికి అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. ఈ మూడు గ్రామాల రైతులు ఈ రోజు మంత్రి హరీష్‌ రావును కలిశారు. ముంపు నుండి తప్పించడంపై ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి రైతులకు చెప్పారు. తుది నిర్ణయం రైతులకు త్వరలోనే అధికారులు తెలియ చేస్తారని అన్నారు. మిగతా గ్రామాల భూసేకరణ రేటుపై రైతులతో ప్రాథమిక చర్చ జరిగింది. తుది నిర్ణయం జిల్లా అధికారులు తీసుకుంటారని మంత్రి చెప్పారు.

వేములవాడ నియోజకవర్గంలో చందుర్తి, కోనరావుపేట మండలాల్లో భూసేకరణ జరుగుతున్న తీరు గ్రామాల వారిగా మంత్రి సవిూక్షించారు. చందుర్తి మండలంలో సేకరించిన 314 ఎకరాల భూమికి వెంటనే చెల్లింపులు జరపాలని ఆదేశించారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ కోసం భూసేకరణను వేగవంతం చేయాలని కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌, సబ్‌ రిజిస్ట్రార్‌, తహశీల్దార్‌ లతో ఫోన్‌ లో మాట్లాడి, ఆదేశాలిచ్చారు. మల్యాల, కొడిమ్యాల, బోయిన్‌ పల్లి మండలాల్లో భూసేకరణ కోసం అధికారులు స్థానిక ఎంపీ వినోద్‌ కుమార్‌, యంఎల్‌ఎ శోభ ల సహకారం తీసుకోవాలని మంత్రి హరీష్‌ రావు సూచించారు.

మిడ్‌ మానేరులో ముంపుకు గురౌతున్న సంకేపల్లి గ్రామ సమస్యలను పరిశీలించడానికి కమిటీని వేయాలని ఆదేశించారు. త్వరలోనే ఎల్లంపల్లి, మిడ్‌ మానేరు ఏజెన్సీలతో సమావేశం కావాలని మంత్రి నిర్ణయించారు.

హైదరాబాద్‌ లోని సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో కరీంనగర్‌ ఎంపీ వినోద్‌ కుమార్‌, వేములవాడ ఎంఎల్‌ఎ చెన్నమనేని రమేష్‌, చొప్పదండి ఎంఎల్‌ఎ బొడిగె శోభలతో పాటు.. ఇరిగేషన్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.కె. జోషి, ఇఎన్‌ సీ మురళీధర్‌ రావు, కరీంనగర్‌ సీఇ అనిల్‌ కుమార్‌, ఎస్‌.ఇ. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.