ఎల్లూరు,అమరగిరి,రేకులవలయం గ్రామాల గిరిజన చెంచు కుటుంబాలకు శాశ్వత ఉపాధి-కలెక్టర్ టి.ఉదయ్ కుమార్

మత్స్య శాఖ,ఐ.టి.డి.ఏ ఆధికారి,చెంచు కుటుంబాలతో కలెక్టర్ సమావేశం

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై30(జనంసాక్షి):

నాగర్ కర్నూల్ జిల్లా కృష్ణా నదిపరివాహక ప్రాంతంలోని గిరిజన చెంచులకు ఉపాధి కల్పించేందుకు ఎం.ఎస్.ఎం.ఈ. కింద 60 శాతం సబ్సిడీతో చేపల నిల్వ కేంద్రం ఏర్పాటుకు సత్వర చర్యలు చెపట్టాలని జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అధికారుల ను ఆదేశించారు.ఎల్లూరు,అమరగిరి లోని 50 కుటుంబాలు,రేకులవలయం గ్రామానికి చెందిన 30 కుటుంబాలు వెరసి 80 గిరిజన చెంచు కుటుంబాలకు శాశ్వత ఉపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా 60శాతం సబ్సిడీతో చేపల నిల్వ కేంద్రం ఏర్పాటు పై మత్స్య శాఖ, ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు ఆధికారి తో పాటు లబ్దిదారులైన చెంచు కుటుంబాలతో శనివారం కలెక్టరేట్ లో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా కలెక్టర్ వివరిస్తూ 35.742 లక్షల విలువ కలిగిన ఈ యూనిట్ కు ఒక షెడ్, ఒక బొలెరో వాహనం, బోటు, ఒక ట్రాక్టర్, ఐస్ క్రషర్, ప్లాస్టిక్ బాక్స్ లు తదితరములు ఏర్పాటు చేయవలసి ఉంటుందన్నారు. 60 శాతం అనగా రూ. 21.44 లక్షలు సబ్సిడీ వస్తుందని మిగిలిన 30 శాతం బ్యాంకు ఋణము ఇవ్వగా మిగిలిన 10 శాతం లబ్దిదారులు తమ వాటా గా జమచేయాల్సి ఉంటుందన్నారు. ఆగస్టు 15 నాటికి యూనిట్ ప్రారంభించే విధంగా లబ్ది దారులు, అధికారులు కలిసి పని చేయాలని ఆదేశించారు.స్థానికంగా దొరికే రాళ్లు ఇతర మెటీరియల్ తో షెడ్ నిర్మాణం పూర్తి చేసుకునే విధంగా చూడాలని సూచించారు.బ్యాంకు రుణం ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ ను ఆదేశించారు. ఆగస్టు 15 కు యూనిట్ ప్రారంభించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారు లను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అధికారి లక్ష్మప్ప,పి.ఓ ఐ.టి.డి.ఏ అశోక్, లీడ్ బ్యాంక్ మేనేజర్ కౌశల్ కిషోర్ పాండే,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.