ఎల్వీ బదిలీతో అధికారులకు హెచ్చరిక 

ఎవరూ ఊహించనివిధంగా చీఫ్‌ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంపై బదిలీ వేటేసిన తీరు సర్వత్రా ఆశ్చర్యానికి, ఆందోళనకు గురిచేసేదిగా ఉంది. నిస్వార్థంగా, డ్యూటీకి కట్టుబడి ఉండే అధికారిగా ఎల్వీ సుబ్రమణ్యానికి పేరుంది. అలాగే విధి  నిర్వహణలో ఆయన ఖచ్చితంగా ఉంటారు. మొహమాటాలకు తావుండదు. అదే ఇప్పుడు సిఎం వైఎస్‌ జగన్‌కు నచ్చినట్లుగా లేదు. దీనికితోడు ఇటీవల తిరుమలలో అన్యమత ఉద్యోగులు చేరి, సిఎస్‌ సుబ్రమణ్యం తీరుపై గుర్రుగా ఉన్నారు. టిటిడిలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను బదిలీ చేయాలని సిఎస్‌గా ఎల్వీ సుబ్రమణ్యం గట్టిగానే ప్రయత్నం చేశారు. అయితే వీరంతా జగన్‌తో తమ గోడు వెళ్ల బోసుకున్నారన్న వార్తలు కూడా ఉన్నాయి. ప్రవీణ్‌ ప్రకాశ్‌కు షోకాజ్‌ నోటీస్‌ ఇవ్వడం పైకి కనిపిస్తున్న వ్యవహారమే అయినా తిరుమల వ్యవహారమే అంతర్గతంగా ఉందన్న ప్రచారం ఉంది. మొత్తంగా ఎల్వీని బదిలీ చేసిన తీరుమాత్రం అవమానకరంగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయనను తప్పించా లను కుంటే పిలిచి మాట్లాడవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరుండాలన్నది ముఖ్యమంత్రి కున్న విశేష అధికారం.సీఎస్‌ పదవిలోనే కాదు, ఏయే శాఖలకు ఎవరు కార్యదర్శిగా ఉండాలో, ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శులకు, ముఖ్యకార్యదర్శులుగా, ప్రత్యేక కార్యదర్శులుగా ఎవరు ఉండాలన్నది కూడా ముఖ్యమంత్రికున్న విశేష అధికారాల్లో ఒకటి. అయితే కొన్ని విషయాల్లో సిఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం సిఎం వైఎస్‌ జగన్‌ అభిమతానికి భిన్నంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయని అంటున్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి.సుబ్రహ్మణ్యంపై బదిలీ వేటు పడిందన్న ప్రచారం సాగుతోంది. ఆయన్ను బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి విభాగానికి డైరెక్టర్‌ జనరల్‌గా బదిలీ చేశారు ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాష్‌ సోమవారం జారీ చేసిన ఉత్తర్వులు కలకలం రేపాయి. నూతన తాత్కాలిక సిఎస్‌గా భూపరిపాలనా శాఖ ప్రధాన కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ను నియమించిన ప్రభుత్వం ఎల్‌వి సుబ్రహ్మణ్యంను తక్షణమే బాధ్యతల నుండి వైదొలగా లని ఈ ఉత్తర్వుల్లో ఆదేశించింది. మరో ఐదు నెలల్లో ఉద్యోగ విరమణ చేయనున్న సిఎస్‌ను అనూహ్యంగా బదిలీ చేయడం, అది కూడా ఏమాత్రం ప్రాధాన్యత లేని పోస్టుకు మార్చడం, తక్షణమే బాధ్యతల నుండి తప్పు కోవాలని ఆదేశించడం వంటి చర్యలు చర్చనీయాంశంగా మారాయి. రాష్టాన్రికి నూతన సిఎస్‌గా కేంద్ర సర్వీసులో ఉన్న నీలం సహాని వచ్చే అవకాశం ఉందని సమాచారం. కొద్దిరోజుల క్రితం ఏ అధికారి కైతే సిఎస్‌ ¬దాలో ఎల్‌వి సుబ్రహ్మణ్యం షోకాజ్‌ నోటీస్‌ జారీ చేశారో, ఆ అధికారి పేరుతోనే తాజా బదిలీ ఆదేశాలు వెలువడటం విశేషం. ఒక ప్రతిపాదన తనకు తెలియ చేయకుండా మంత్రి మండలి సమావేశం ముందుకు తీసుకురావడంపై సాధారణ పరిపాలనశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌కు ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఈ నెల ఒకటో తేదిన నోటీస్‌ జారీచేశారు. ‘సిఎస్‌ ఆమోదం లేకుండా కేబినెట్‌ అజెండాలో అంశాలను ఎలా చేరుస్తారు? ఇది బిజినెస్‌రూల్స్‌కు విరుద్దం. దీనిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వండని ఈ నోటీస్‌లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి తెలియకుండా ఈ షోకాజ్‌ నోటీస్‌ జారీ కావడంపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. దీంతో తక్షణమే ఆయన బదిలీ జరిగిందని కూడా అంటున్నారు. దీంతో అధికారుల్లోనూ, ఇటు రాజకీయ పార్టీల నేతల్లోనూ చర్చ మొదలైంది. షోకాజు నోటీసు ఇచ్చిన వెంటనే బదిలీ చేయడమంటే అధికారుల మానసిక స్థయిర్యాన్ని దెబ్బతీయడమేనని ఉన్నతాధికారులు చెబుతు న్నారు. కేంద్ర సర్వీసులో ఉన్న నీలం సహాని సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నివాసానికి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆమెను సిఎస్‌గా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. మాజీ
ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి నమ్మినబంటుగా ఆమె ఉండే వారని చెబుతున్నారు. ప్రసుత్తం సామాజిక న్యాయశాఖలో కార్యదర్శిగా ఉన్నారు. ఎల్వీని తక్షణమే రిలీవ్‌ కావాలన్న ప్రభుత్వం… సీసీఎల్‌ఏ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అయితే, మరో 5నెలల సర్వీసు ఉండగానే, ఎల్వీ సుబ్రమణ్యంపై బదిలీ వేటేయడం తీవ్ర సంచలనంగా మారింది. ఎన్నికలకు ముందు అప్పటి సీఎస్‌ అనిల్‌చంద్ర పునేటాను తప్పించిన ఈసీ…. ఎల్వీకి బాధ్యతలు అప్పగిం చింది. అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం… ఎల్వీని సీఎస్‌గా కొనసాగించింది. సీబీఐ కేసుల్లో జగన్‌కి ఎల్వీకి లింకులున్నాయంటూ ఆరోపణలు విమర్శలు వచ్చినా… సీఎస్‌గా కొనసాగించారు. అలాంటిదిప్పుడు సడన్‌గా ఎల్వీపై బదిలీ వేటేయడంతో అంతా షాక్‌ అవుతున్నారు. అయితే, ఎల్వీపై బదిలీ వేటేయడానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జీఏడీ పొలిటికల్‌ సెక్రటరీ, సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాషే కారణమని చెబుతున్నారు. ఎల్వీ, ప్రవీణ్‌ మధ్య తలెత్తిన విభేదాలు, ఆధిపత్య పోరే… ఆకస్మిక బదిలీకి కారణమని బ్యూరోక్రాట్స్‌ గుసగుసలాడుకుంటున్నారు. అయితే, ఎల్వీ బదిలీ వెనుక సీఎం జగన్‌ ఆగ్రహం ఉందని అంటున్నారు. తాను తీసుకునే నిర్ణయాలకు ఎస్‌…చెప్పకుండా ఫైల్స్‌ తిప్పిపంపడమే కారణమని చెబుతున్నారు. మొత్తంగా ఇప్పుడు ఎల్వీ బదిలీతో సిఎం వైఎస్‌ జగన్‌ అధికారుల పట్ల కఠినంగా ఉంటారని, తనపర అన్న భేదం చూపరని సందేశం ఇచ్చారు. అంతా తన కనుసన్నల్లో జరగాలన్న భావనలోనూ ఉన్నట్లు సందేశం ఇచ్చారు.