‘హస్తమే’ ఆధిక్యం
జనంసాక్షి సర్వేలో కాంగ్రెస్ పై‘చేయి’
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రెండు దఫాల్లో ప్రీ పోల్ సర్వే
అంతిమ ప్రజా తీర్పు అధికార పార్టీవైపే మొగ్గు
హోరాహోరీగా తలపడుతున్న బీఆర్ఎస్
ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్న బీజేపీ
డివిజన్లవారీగా కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల ముమ్మర ప్రచారం
హైదరాబాద్, నవంబర్ 06 (జనంసాక్షి) : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నవారికి ‘జనంసాక్షి’ తన తుది సర్వే తీర్పును వెలువరించింది. సర్వేల్లో ఇప్పటివరకు మేటి సంస్థగా పేరొందిన ‘జనంసాక్షి’ సార్వత్రిక ఎన్నికలు సహా అన్ని తరహా ఎన్నికల సమరంలో సర్వే ఫలితాలు వెలువరించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విషయం విదితమే. తాజాగా మరోసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రీ పోల్ సర్వే ఫలితాలను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రజల్లో ఉన్నది, వారితో పంచుకున్నది, విస్తృతంగా విన్నది తన సర్వే బ్యాలెట్ నిక్షిప్తం చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ పోలింగ్ కంటే ముందే ఓటర్ల నాడీని బహిర్గతం చేసి తెలంగాణ సమాజంలో ఆసక్తి రేకెత్తించింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఏడు డివిజన్లలో రెండు దఫాలుగా ప్రీ పోల్ సర్వే చేపట్టగా.. స్వల్ప మార్పులు చేర్పులు మినహా పెద్దగా తేడా లేదు. అధికార పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అంతిమ తీర్పులో గెలుపొందనున్నట్టు జనంసాక్షి సర్వేలో వెల్లడైంది. గురువారం ఏడు డివిజన్లలో రెండోసారి జనంసాక్షి సర్వే కొనసాగించగా.. బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలో మినహా మిగతాచోట్ల హస్తం ఆధిపత్యం నడుస్తోంది. రహమాత్ నగర్లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఆధిక్యం ఉండగా.. సోమాజీగూడ, యూసఫ్గూడ, వెంగళ్వ్నగర్ డివిజన్లలోనూ ‘కారు’ను మించిపోతోంది. షేక్పేట డివిజన్లో మాత్రం కాంగ్రెస్ భారీగా ఓట్లు కూడగట్టనున్నట్టు సర్వేలో తేలింది.
సానుభూతి వర్సెస్ సానుభూతి
ఒకవైపు కీర్తిశేషులైన మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీత గెలుపు కోసం బీఆర్ఎస్ అగ్రనేతలు సర్వశక్తులూ ఒడ్డుతుండగా.. మరోవైపు అధికార పార్టీ టికెట్ పొందిన నవీన్ యాదవ్ కూడా తన శక్తినంతా కూడదీసి ప్రచారంలోకి దిగారు. గతంలో రెండుసార్లు ఓటమి పాలయ్యారనే అభిప్రాయం స్థానికుల్లో బలంగా ఉండగా.. రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేని మాగంటి సునిత ప్రతిపక్ష పాత్ర ఎలా పోషిస్తుందోనన్న ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఉన్నది మూడేండ్లే కాబట్టి అధికార పార్టీ అభ్యర్థిని ఆదరించాలనే వాదన ఓటర్లలో వినబడుతోంది. అభివృద్ధితో పాటు అవకాశం కూడా ఇచ్చినట్లవుతుందని ప్రజలు భావిస్తున్నారు.
నియోజకవర్గవ్యాప్తంగా పార్టీలవారీగా ఓటింగ్ శాతం
కాంగ్రెస్ : 48.5%
బీఆర్ఎస్ : 44%
బీజేపీ : 7.5%



