ఎవరన్నారు తెలంగాణ ముగిసిన అధ్యాయంమని

చర్చలు కొనసాతున్నాయి
అఫ్జల్‌ గురు  ఉరి రాజకీయ నిర్ణయం కాదు
నిబందనలమేరకే అమలు : షిండే
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (జనంసాక్షి):
తెలంగాణ అంశం ముగిసిన అధ్యాయం కాదని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే అన్నారు. తెలంగాణ అంశం ముగిసిన ఆధ్యాయమంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. సోమవారం నాడు ఆయన మీడియా సమావేవంలో మాట్లాడారు. తెలంగాణపై సంప్రదింపులు అవసరమని,  ఈ ప్రక్రియ కొనసాగుతున్నదని ఆయన చెప్పారు. తెలంగాణపై చర్చలకు ఎలాంటి తుది గడువు లేదని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణపై ఇప్పుడిప్పుడే నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదన్నారు. తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని తమకూ ఉందని ఆయన తెలిపారు. తెలంగాణ అంశాన్ని తీవ్రంగా    పరిగణిస్తున్నామన్నారు. పరిష్కారానికి ఎలాంటి డెడ్‌లైన్లు లేవన్నారు. మూడు ప్రాంతాల నేతలతో చర్చించాల్సి ఉందని ఆయన చెప్పారు.
పార్లమెంట్‌ దాడి ఘటనలో నిందితుడు అఫ్జల్‌గురును ఉరి తీసే విషయాన్ని ఆయన కుటుంబానికి తాము ముందే సమాచారమందించామని షిండే చెప్పారు. సమాచారం అందలేదని ఆయన కుటుంబ సభ్యులు చెప్పడం సరికాదన్నారు. ఈ నెల 7వ తేదీన స్పీడు పోస్టులో సమాచారం అందించామన్నారు. హిందూ టెర్రరిజం గురించి పలు సందర్భాల్లో తాను స్పష్టంగా చెప్పానని అన్నారు.
రాజీవ్‌ గాంధీ, పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రుల హత్య కేసు దోషుల గురించి ప్రస్తావించిన జమ్ము కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఓమర్‌ అబ్దుల్లా వ్యాఖ్యలను షిండే ఖండించారు. రాజీవ్‌, బియాంత్‌సింగ్‌ హత్య కేసులు సుప్రీం కోర్టులో విచారణలో ఉన్నాయన్నారు. గురు ఉరిపై తానే స్వయంగా 8వ తేదీన ఓమ ర్‌కు ఫోన్‌ చేసి చెప్పానని షిండే చెప్పారు. అఫ్జల్‌ గురు, అజ్మల్‌ కసబ్‌ల ఉరి రాజకీయపరమైన నిర్ణయాలు కావన్నారు. చట్టం సూచనల మేరకు, నిబంధనల ప్రకారమే ఉరితీత జరిగిందన్నారు. అఫ్జల్‌ గురు అంశం సున్నితమైనదన్నారు. అఫ్జల్‌ గురు విషయంలో చట్టం తనపనితాను చేసుకుపోయిందన్నారు. ఇలాంటి విషయాలు సున్నితమైనందునే గోప్యత పాటించాల్సిన అవసరం ఉందన్నారు. బిజెపి ఒత్తిడి మేరకే అఫ్జల్‌గురును ఉరితీశారని వస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. నిబంధనల మేరకే ఈ ప్రక్రియ జరిగిందన్నారు. రాజకీయ నిర్ణయాలకు తావులేదన్నారు. పోలీసు శాఖకు సంబంధించిన అన్ని అంశాలను బయటకు వెల్లడించలేమన్నారు. దేశభద్రతకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని షిండే స్పష్టం చేశారు.