ఎవరెన్ని కుట్రలు చేసినా ఫలించవు
వచ్చే ఎన్నికల్లో విజయం టిడిపిదే
గుంటూరు పర్యటనలో మంత్రి లోకేశ్
గుంటూరు,జూన్5(జనం సాక్షి): 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం ఏపీ మంత్రి లోకేష్ ధీమా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామని అన్నారు. ఎవరు గూడుపుఠాణి చేసినా గెలుపు టిడిపిదేనని అన్నారు. గుంటూరు జిల్లాలోని వినుకొండ నియోజకవర్గంలో ఏపీ మంత్రి లోకేష్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన శావల్యాపురం మండలం వేల్పూర్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మంత్రి విూడియాతో మాట్లాడుతూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. గ్రామాలు, తండాల్లో సీసీ రోడ్లు వేస్తున్నామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బిజెపి నేత జీవీఎల్ నర్సింహారావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ ట్విట్టర్ ద్వారం కౌంటర్ ఇచ్చారు. ఎపి ప్రభుత్వం సమర్పించిన యూసీలు సరిగా లేవని చెప్పడానికి జీవీఎల్ ఎవరు అని ప్రశ్నించారు. సమర్పించిన యూసీలు సరిగా లేకపోతే కేంద్రంలోని ఆయా శాఖలు వివరణ అడుగుతాయి కదా అని అన్నారు. వెనుక బడిన జిల్లాలకు కేటాయించిన రూ. 1000 కోట్ల నిధులకు సంబంధించిన యూసీలు ఇప్పటికే సమర్పించామని, కేంద్ర శాఖలు కూడా ఆమోదించాయని ట్వట్టర్‌లో మంత్రి లోకేష్ పేర్కొన్నారు. అమరావతిలో డ్రైనేజీ పనులకు నిధులు విడుదల చేయలేదన్నారు. విజయవాడ, గుంటూరు నగరాలకు మాత్రమే నిధులు విడుదల చేశారని తెలిపారు. ఇప్పటి వరకు అయిన రూ.349 కోట్ల పనులకు యూసీలు సమర్పించామని వెల్లడించారు. ఇప్పటి వరకు అమరావతికి కేంద్రం ఇచ్చింది రూ.1500 కోట్లు మాత్రమే అని మంత్రి చెప్పారు. రూ. 1583 కోట్లకు యూసీలు సమర్పించామని…వాటినీ ఆమోదించారని మంత్రి తెలిపారు. ఏ ఊహాజనిత ప్రాజెక్ట్‌కు రూ.8962 కోట్లు విడుదల చేశారో జీవీఎల్ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తమరు చెప్పినవి అబద్దాలు అని ఒప్పుకోవాలని ట్విట్టర్ వేదికగా జీవీఎల్‌కు మంత్రి లోకేష్ సవాల్ విసిరారు.
వైకాపా ఎంపిలది డ్రామాలు
వైకాపా ఎంపీల రాజీనామాలపై మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్లో స్పందించారు. రాజీనామాల విషయంలో వైకాపాది గొప్ప నటన అని ఎద్దేవా చేశారు. ప్రజలను మభ్యపెట్టి, భాజాపాతో కుమ్మక్కై ఉప ఎన్నికలురాకుండా జాగ్రత్త పడటంలో గొప్ప నటన కనబర్చారని విమర్శించారు. రాజీనామా డ్రామాకు గాను వైకాపా ఎంపీలకు భాస్కర్ అవార్డ్స్ ఇవ్వాలని వ్యంగ్యంగా విమర్శించారు. వారు సొంత కథతో ‘ఏ1, అర డజన్ దొంగలు’ సినిమా తీస్తే బాగుంటుందని లోకేశ్ ఎద్దేవా చేశారు.