ఎవరెస్టు ఎత్తుకు మనబిడ్డలు

1

– మంత్రి చందూలాల్‌

హైదరాబాద్‌,డిసెంబర్‌12(జనంసాక్షి): ఎవరెస్టు పర్వతమంత ఎత్తుకు మన తెలంగాణ బిడ్డల ఖ్యాతి ఎదుగుతున్నదని పర్యాటక మరయు సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌  కొనియాడారు. ఈ నెల 7వ తేదీన హిమాలయాల్లోని మౌంట్‌ రేనాక్‌ పర్వతాన్ని అధిరోహించిన 17 మంది  గిరిజన విధ్యార్ధులను శనివారం నాడు మంత్రి చందూలాల్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిపుత్రులను ప్రోత్సహించి సరైన అవకాశాలు కల్పిస్తే అద్భుతాలను సృష్టిస్తారని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి గిరిజన విద్యార్థులను అభినందిస్తూ ఒక్కొక్కరికి రూ. 51,000లను ప్రభుత్వం ప్రోత్సహకరంగా అందజేస్తుందని మంత్రి తెలిపారు.మంత్రి మాట్లాడుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి పేదరికం అడ్డుకాదని వీరు నిరూపించారని పేర్కొన్నారు. పదిహేనేళ్ళ లోపున్న గిరిజన విద్యార్ధులు రాష్ట్రానికి తలమానికంగా నిలిచారని ప్రశంసించారు. మట్టిలో మాణిక్యాలంటూ పట్టుదల, క్రమశిక్షణ, ప్రోత్సహం ఉంటే ఏదైనా సాధించడానికి వీరే నిదర్శనమని గిరిజన విధ్యార్ధులను కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర పతకాన్ని ఎవరెస్ట్‌, శిఖరంపై రెపరెపలాడించాలని, ఇందుకు అవసరమైన సహాయ, సహకారాలను ప్రభుత్వ పరంగా అందించేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వంతో పాటు కార్పొరేట్‌ రంగం నుంచి కూడా.ప్రోత్సహన్ని అందించవలసిందిగా పరిశ్రావికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. గిరిజన వసతి గృహాల్లోని విద్యార్ధులు మానసికంగా, శారీరకంగా అభివృద్ది చెందేందుకు క్రీడా సామాగ్రిని సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. గిరిజన విద్యార్ధుల్లోని ప్రతిభా పాటవాలను గుర్తించి వారిని ఆయా రంగాల్లో ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు.