ఎస్బీఐలో కనీసం రూ.5 వేల బ‌్యాలెన్స్ నిబంధన ఎత్తివేయాలి..
న్యూఢిల్లీ: సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో కనీసం రూ.5 వేల బ్యాలెన్స్ ఉంచాలని ఎస్బీఐ విధించనున్న నిబంధనను తొలిగించాలని ఇవాళ ప్రతిపక్ష పార్టీలు రాజ్యసభలో డిమాండ్ చేశాయి. దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ అయిన ఎస్బీఐ ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలు చేయనున్నది. సేవింగ్స్ అకౌంట్ ఖాతాలో మీనిమం బ్యాలెన్స్ రూ.5వేలు ఉండాలని, లేదంటే జరిమానా విధిస్తామని ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ అంశాన్ని ఇవాళ ప్రతిపక్షాలు రాజ్యసభలో లేవనెత్తాయి. జీరో అవర్‌లో సీపీఐ ఎంపీ కేకే రాజేశ్ ఈ అంశంపై మాట్లాడారు. మీనిమం బ్యాలెన్స్ లేకుంటే ఎస్బీఐ విధించనున్న జరిమానా దారుణమన్నారు. ఆ నిబంధన వల్ల సుమారు 31 కోట్ల మంది ఖాతాదారులు ఇబ్బందిపడుతారన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బ్యాంకు ఖాతా తెరిచి, డిజిటిల్ చెల్లింపులు చేస్తున్న పేద, మధ్యతరగతి కస్టమర్లకు ఈ చర్య సరైందికాదన్నారు. ఎస్బీఐ కొత్త నిబంధనలపై ప్రభత్వం జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ మీనిమం బ్యాలెన్స్ లేకుండా సేవింగ్స్ ఖాతాపై సుమారు వంద రూపాయల వరకు జరిమానా విధించనున్నారు.