ఎస్సీఎస్టీ చట్టంపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో టిడిపి బృందం భేటీ

న్యూఢిల్లీ,జూన్‌11(జ‌నం సాక్షి): రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను సోమవారం టీడీపీ బృందం కలిసింది. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. అనంతరం మంత్రి ఆనందబాబు విూడియాతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం నిర్వీర్యమవుతోందన్నారు. 9వ షెడ్యూల్‌లో చేర్చి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని బలపరచాలని కోరినట్లు చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం 12మంది దళితులు చనిపోయారన్నారు. కేంద్రం జోక్యం చేసుకొని దళితులకు భరోసా కల్పించాలని ఆనందబాబు కోరారు. కేంద్రం ఎస్సీ, ఎస్టీల హక్కులను కాలరాస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలు టీడీపీ వెంటే ఉన్నారని టీడీపీ నేత, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌ అన్నారు. దళితులకు అండగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై… వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్రం నిర్ణయం తీసుకోవాలని ఎస్టీ, ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ డిమాండ్‌ చేశారు. లేదంటే కేంద్రం పెద్దల నివాసాల ముందు ధర్నాలు చేస్తామని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై విపక్ష నేత జగన్మోహన్‌ రెడ్డి మాట్లాడకపోవడం సిగ్గుచేటని మంత్రి జవహర్‌ అన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై తమ విజ్ఞప్తిపట్ల రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారన్నారు. బడుగు, బలహీనవర్గాల రక్షణను ప్రభుత్వాలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలను కేంద్రం పట్టించుకోవడంలేదని టీడీపీ నేత రవీంద్రబాబు ఆరోపించారు. కోర్టులు తీర్పు ఇచ్చే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై కేంద్రానికి చిత్తశుద్ధిలేదన్నారు. రిజర్వేషన్లు, ప్రమోషన్లు సక్రమంగా ఉండేలా చూడాలని రవీంద్రబాబు సూచించారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.