ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టి అమలు చేయాలి
సూర్యాపేట జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
– ఎమ్మార్పీఎస్ టీఎస్ జాతీయ అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి) : మాదిగ కులస్తుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయడంతో పాటు ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టి అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ జాతీయ అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ డిమాండ్ చేశారు.శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ టీఎస్ సూర్యాపేట జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని విమర్శించారు.తెలంగాణ రాష్ట్రం రాకముందు మాదిగ కులస్తుల పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా పరిస్థితి అలానే ఉందన్నారు.సంక్షేమ పథకాల పేరుతో ఎస్సీల సంక్షేమానికి కేటాయించిన నిధులను పక్కదారి పట్టించారన్నారు.మేనిఫెస్టోలో దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.అర్హులైన వారందరికీ దళిత బంధు పథకాన్ని అమలు చేయాలన్నారు.డప్పు, చెప్పుల వృత్తిని చేపట్టే వృత్తిదారులకు నెలకు రూ.2 వేలు ఫించన్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలన్నారు.ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కొరకు ఉద్యమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.ఆత్మగౌరవం కొరకు జాతి పక్షాన నిలబడి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే,సావిత్రి బాయి పూలే , జగ్జీవన్ రావు వంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.చదువుతోనే భవిష్యత్ ఉంటుందని చెప్పారు.అనంతరం సూర్యాపేట జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.సూర్యాపేట జిల్లా అధ్యక్షులుగా పడిదల రవికుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా బచ్చలకూరి నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా బచ్చలకూరి శ్రీనుతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ టీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి చింత బాబు మాదిగ,నాయకులు పల్లేటి లక్ష్మణ్,మరికంటి అంబేద్కర్,విజయ్ భాస్కర్, పరశురాములు,జానయ్య, కృష్ణబాబు,ఎల్లయ్య,రమణ, శోభ,సూరయ్య, రామయ్య, సుదర్శన్,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.